కమలదళం గొంతులో పచ్చి వెలక్కాయ్!

కాషాయదళానికి ఇది గుబులే. తెలంగాణలో ఎప్పటికైనా సరే తాము అధికారంలోకి వచ్చి తీరుతాం అనే ఆశతో ప్రస్థానం సాగిస్తున్న, ప్రస్తుత ఎన్నికల్లోనే గద్దె ఎక్కి తీరుతామని ప్రగల్భాలు పలుకుతున్న ఆ పార్టీకి మింగుడుపడని విషయం…

కాషాయదళానికి ఇది గుబులే. తెలంగాణలో ఎప్పటికైనా సరే తాము అధికారంలోకి వచ్చి తీరుతాం అనే ఆశతో ప్రస్థానం సాగిస్తున్న, ప్రస్తుత ఎన్నికల్లోనే గద్దె ఎక్కి తీరుతామని ప్రగల్భాలు పలుకుతున్న ఆ పార్టీకి మింగుడుపడని విషయం ఇది. జనాకర్షక పథకాలే ప్రాతిపదికగా.. ప్రజలను మాయచేసి.. వారికి అధికారికంగా పథకాల రూపంలో డబ్బు పంచిపెట్టి నెగ్గడమే లక్ష్యంగా పార్టీలు చెలరేగుతున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఇరుకున పడుతోంది. 

కాంగ్రెస్ పార్టీ ఆరు వరాలను ప్రకటించిన తరువాత, తాజాగా భారత రాష్ట్ర సమితి తమ మేనిఫెస్టోను కూడా విడుదల చేసిన తర్వాత.. భాజపాకు ఎదురవుతున్న ఇరకాటం స్పష్టంగానే కనిపిస్తోంది.
 
ప్రధాని మోడీ సుమారు సంవత్సర కాలానికి పైగా.. ప్రజాకర్షక పథకాల పట్ల చురకలు వేస్తున్నారు. రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ఓట్లను రాబట్టుకోవడం కోసం ప్రకటిస్తున్న అనేక పథకాలు ఆయా రాష్ట్రాలని ఆర్థికంగా కుదేలు చేసే వ్యవహారాలుగా మారుతున్నాయంటూ ఆయన విమర్శలు కురిపిస్తున్నారు. 

భారతీయ జనతా పార్టీ ఇలాంటి తాయిలాల రాజకీయాలకు దూరంగా ఉంటుందని, తమకు తాము కితాబు ఇచ్చుకుంటున్నారు. సాధారణ సందర్భాల్లో బహిరంగ వేదికల మీద ఎన్నెన్ని మాటలు చెబుతున్నప్పటికీ.. ఎన్నికల సమయం వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి కూడా ఇలాంటి మాటలు తప్పడం లేదు. కర్నాటక ఎన్నికల్లో వారు కొన్ని ప్రజాకర్షక తాయిలాల మాటలు ప్రకటించారు గానీ.. వర్కవుట్ కాలేదు.

అయితే ఇప్పుడు తెలంగాణలో ఇంకా గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతున్నారు. పెన్షన్లు అనే ఒక్క అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుంటే.. కాంగ్రెసు పార్టీ తాము వృద్ధులకు నాలుగువేల రూపాయలు ఇస్తాం అని ప్రకటించగా.. కేసీఆర్ దానిని ఏకంగా రూ. 5016కు పెంచేశారు. ప్రస్తుతం మూడువేల పెన్షను అందుతుండగా.. దానిని పెంచడంలో షెడ్యూలును కూడా స్పష్టంగా వెల్లడించారు. వికలాంగులకైతే ఏకంగా ఆరువేలు చేస్తానని అన్నారు. ఈ పెన్షను హామీలను భాజపా కూడా చెప్పగలుగుతుందా? అనేది ఇప్పుడు కీలక ప్రశ్న!

ఉచిత పథకాలు, ఆకర్షక తాయిలాలకు వ్యతిరేకం అయిన భాజపా.. 5-6 వేల పెన్షన్లను ప్రకటించడం అనేది వారి సిద్ధాంతాలకు విరుద్ధం అవుతుంది. తెలంగాణలో పోటీకోసం అలా ప్రకటించినా.. వారికి ఆత్మహత్యా సదృశం అవుతుంది. బిజెపి ఏలుబడిలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఆ మేరకు అమలు చేసి.. ఆ తర్వాత ఇక్కడకు వచ్చి మాటలు చెప్పాలనే సవాలు ఎదురైతే వారు ఉక్కిరి బిక్కిరి అవుతారు.

అలాగే గ్యాస్ సిలిండర్ విషయం కూడా బిజెపికి ఇరకాటమే. 1100 దాటిపోయిన సిలిండరు ధరను కేంద్రం ఇటీవల 300 వరకు తగ్గించింది. అయితే కేసీఆర్ సర్కారు పేదలందరికీ మరో నాలుగువందలు తగ్గిస్తున్నట్టుగా ప్రకటించారు. అలాంటి ప్రకటన చేయగల అవకాశం బిజెపికి లేదు. ఒకవేళ చేయదలచుకున్నా ఎదురుదెబ్బ తగులుతుంది. బిజెపికి చేతనైతే దేశమంతా ఆ మేర తగ్గించాలని భారాస విరుచుకుపడుతుంది.

ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్, భారాస మేనిఫెస్టోలు విడుదలైన తర్వాత.. కమలదళానికి తెలంగాణలో ఇబ్బందులు తప్పవని, గెలుపు అవకాశాలు మరింతగా కుంచించుకుపోతున్నాయని అనిపిస్తోంది.