ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే మందు పార్టీ పెట్టారు

అక్కడ-ఇక్కడ తాగడం ఎందుకు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే తాగుదాం అనుకున్నారేమో. ఇద్దరు కానిస్టేబుల్ పట్టపగలు స్టేషన్ లోనే బార్ ఓపెన్ చేశారు. ఎంచక్కా మందు, స్నాక్స్ తెప్పించుకొని పార్టీ షురూ చేశారు. అయితే…

అక్కడ-ఇక్కడ తాగడం ఎందుకు.. ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే తాగుదాం అనుకున్నారేమో. ఇద్దరు కానిస్టేబుల్ పట్టపగలు స్టేషన్ లోనే బార్ ఓపెన్ చేశారు. ఎంచక్కా మందు, స్నాక్స్ తెప్పించుకొని పార్టీ షురూ చేశారు. అయితే ఓ వ్యక్తి ఈ మొత్తం వ్యవహారాన్ని షూట్ చేస్తున్నాడని గ్రహించలేకపోయారు. ఆ వీడియో కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది.

4 రోజుల కిందట జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ పీఎస్ లో జరిగింది ఈ ఘటన. వీడియోలో ఇద్దరు కానిస్టేబుళ్లు, పోలీస్ స్టేషన్ లోనే మద్యం తాగుతున్నట్టు స్పష్టంగా ఉంది.

అసలేం జరిగింది..

సరిగ్గా 4 రోజుల కిందట ఉరవకొండ పోలీస్ స్టేషన్ పరిథిలో ఓ ఘటన జరిగింది. బహిరంగంగా మద్యం తాగుతున్న కొంతమంది యువకుల్ని అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. వాళ్లను కొట్టి వాళ్ల దగ్గర్నుంచి డబ్బు లాక్కున్నారని తెలుస్తోంది.. అక్కడితో ఆగకుండా ఆ యువకులతోనే మద్యం తెప్పించుకున్నారట. అలా తెప్పించుకున్న మద్యంతో పోలీస్ స్టేషన్ లోని పై గదిలో సిట్టింగ్ పెట్టుకున్నారు ఇద్దరు కానిస్టేబుళ్లు.

అలా ఇద్దరూ కలిసి మద్యం తాగుతుంటే గుట్టుచప్పుడు కాకుండా ఓ వ్యక్తి దాన్ని వీడియో తీశాడు. ఎవరు ఈ వీడియో తీశారనే విషయం బయటకు రాలేదు కానీ వీడియో మాత్రం వైరల్ అయింది. విషయం పైస్థాయి అధికారుల వరకు వెళ్లింది. జరిగిన ఘటనపై అంతర్గతంగా విచారణ జరిపిస్తున్నారు.

సరిగ్గా ఏడాది కిందట ఇదే జిల్లా హిందూపూర్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు, సదరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఇప్పుడు అలాంటి ఘటనే ఉరవకొండలో కూడా రిపీట్ అయింది.