థియేటర్ వ్యవస్థకు, ఓటీటీకి మధ్య జరుగుతున్న పోరు కేవలం టాలీవుడ్ కు మాత్రమే పరిమితం కాదు. సౌత్ లోని దాదాపు అన్ని పరిశ్రమల్లో ఇది రాజుకుంది. థియేట్రికల్ సిస్టమ్ ను కాదని, ఓ హీరో నేరుగా ఓటీటీకి వెళ్తే ఎగ్జిబిటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ సెగ ఎలా ఉంటుందో కోలీవుడ్ లో సూర్యకు, టాలీవుడ్ లో నానికి బాగా తెలుసు. ఇప్పుడు మల్లూవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ కు ఆ వేడి తగులుతోంది.
కేరళ థియేటర్ల యాజమాన్య సంఘ ఇప్పుడు దుల్కర్ పై ఫైర్ అవుతోంది. అతడి సినిమాల్ని బ్యాన్ చేసింది. దీనికి కారణం దుల్కర్ తన సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేయడమే. ప్రస్తుతం ఈ హీరో సెల్యూట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేస్తామని ముందుగా ప్రకటించారట. కట్ చేస్తే, మంచి ఆఫర్ వచ్చిందంటూ నేరుగా ఓటీటీ స్ట్రీమింగ్ కు ఇచ్చేశారట.
దీంతో ఫిలిం ఎగ్జిబిటర్స్ యునైటెడ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కేరళ, దుల్కర్ తీరుపై నిరసన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గి థియేట్రికల్ వ్యవస్థ మొత్తం గాడిన పడుతోందని, ఇలాంటి టైమ్ లో ఓటీటీకి వెళ్లడం సరైన నిర్ణయం కాదని వాదిస్తోంది. తక్షణం దుల్కర్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్తులో అతడి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవ్వకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.
సూర్య, నాని సినిమాలకూ తప్పని పాట్లు
మొన్నటికిమొన్న కోలీవుడ్ లో కూడా ఇలాంటి సీన్ జరిగింది. సూర్య నటించిన సినిమాలు రెండు నేరుగా ఓటీటీలోకి వచ్చాయి. ఆ టైమ్ లో అతడి సినిమాలపై కూడా నిషేధం విధిస్తామంటూ తమిళ ఎగ్జిబిటర్లు వార్నింగ్ ఇచ్చారు. తర్వాత ఆ వివాదం సద్దుమణిగింది. సూర్య నటించిన ఈటీ సినిమా థియేటర్లలోనే రిలీజైంది
నాని విషయంలో కూడా ఇదే జరిగింది. కరోనా పీక్ స్టేజ్ లో ఉంది కాబట్టి V అనే సినిమాను నేరుగా ఓటీటీకి ఇచ్చేశారు. ఆ టైమ్ లో ఎలాంటి వివాదాల్లేవు. ఎప్పుడైతే టక్ జగదీశ్ సినిమాను కూడా ఓటీటీకి ఇచ్చేశారో అప్పుడు కొంతమంది ఎగ్జిబిటర్లు ఆందోళన చేశారు. నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత నాని నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమా థియేటర్లలోనే విడుదలై, మొత్తం వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.
ఇప్పుడు సరిగ్గా ఇలాంటి సమస్యనే కేరళలో దుల్కర్ సల్మాన్ ఎదుర్కొంటున్నాడు. మరి ఈ వివాదాన్ని అతడు ఎలా పరిష్కరించుకుంటాడో చూడాలి. అయితే ఇదేమంత పెద్ద ఇష్యూ కాకపోవచ్చు. ఎందుకంటే, అక్కడ దుల్కర్ వెనక అతడి తండ్రి మమ్ముట్టి ఉన్నాడు.