ఏపీలో వైసీపీ మళ్లీ వస్తే… ఇటీవల ప్రతిపక్ష నేతలు తరచూ అంటున్న మాట. మొన్న జనసేన నేత నాగబాబు, నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నోట ఒకే మాట, ఒకే భయం. ఒకవేళ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో సగం మంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు కాందిశీకుల్లా వలస వెళ్లి పోతారని నాగబాబు ఆందోళన వ్యక్తం చేయగా, చంద్రబాబు మరో రూపంలో అదే భయాన్ని వ్యక్తం చేశారు.
వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎవరూ బతకలేరని, బతకనివ్వరని చంద్రబాబునాయుడు హెచ్చరించారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కల్తీ సారా కారణంగా జంగారెడ్డిగూడెంలో ప్రజలు చనిపోతే ముఖ్యమంత్రే స్వయంగా సహజ మరణాలు అంటున్నారన్నారు. ఇలాంటి పాలనను, సీఎంనూ ఎన్నడూ చూడలేదన్నారు.
జనసేన, టీడీపీ, బీజేపీ ఇలా రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు. పార్టీల పేర్లు తప్ప, భయాందోళన మాత్రం ఒకటే. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే….? ప్రతిపక్షాల నేతలు ఆందోళన చెందడంలో నిజమెంత? ఈ భయాందోళన ప్రతిపక్ష పార్టీల ఉనికికే తప్ప, సామాన్య జనానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలవుతున్నాయి. ఎలాంటి సిఫార్సులు లేకుండానే అర్హతను బట్టి అన్ని సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే వస్తున్నాయి.
నాగబాబు, చంద్రబాబు ఆందోళన చెందడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఒకవేళ వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ….జనసేన నాయకులు అన్నీ సర్దుకుని మరో రాష్ట్రానికి వెళ్లాల్సి వుంటుంది. ఎందుకంటే ఆ పార్టీ స్థాపించి ఇప్పటికి 9 ఏళ్లైంది. కనీసం ఆ పార్టీ అధినేతే స్వయంగా ఎన్నికల్లో గెలవలేని దుస్థితి. ఇక మిగిలిన నేతల్ని ఎవరు గెలిపించాలి? 2024లో కూడా జగనే సీఎం అయితే జనసేన మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.
ఇక టీడీపీ విషయానికి వస్తే … ఆ పార్టీ పరిస్థితి అంతే. జగన్ మరోసారి అధికారంలోకి వస్తే బతకలేంది ప్రజలు కాదు, తెలుగు దేశం పార్టీనే. ఎందుకంటే జగన్ మరోసారి అధికారంలోకి రావడం అంటే, ప్రజల ఆశీస్సులతోనే అనే విషయం చంద్రబాబుకు తెలియదా? ప్రజాశీర్వాదంతో వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎవరూ బతకలేరని, బతకనివ్వరని చంద్రబాబు ఎలా అంటారు? ఇవన్నీ ప్రజల్ని రెచ్చగొట్టడానికే తప్ప, మరెందుకూ పనికి రావు.
జగన్ అధికారంలోకి వస్తే మాత్రం టీడీపీని బతకనివ్వరనే భయంతోనే చంద్రబాబు పొంతన లేని విమర్శలు చేస్తున్నారనేది వాస్తవం.