వార్తల ప్రసారం, ప్రచురణలో ఓ ప్రోటోకాల్ ఉంటుంది. రాష్ట్రపతికి సంబంధించిన వార్తల్ని తప్పనిసరిగా కవర్ చేయాలి. అలా రాష్ట్రాల విషయానికొస్తే.. ముఖ్యమంత్రులకు సంబంధించిన వార్తలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. మరీ ముఖ్యంగా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పథకాల్ని కవర్ చేయాలి.
అందులోనూ ప్రభుత్వం నుంచి ప్రకటనల రూపంలో కోట్ల రూపాయల ఆదాయం తెచ్చుకుంటున్న పత్రికలు.. ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వలేమంటే ఎలా..? విద్యా దీవెన అడ్వర్టైజ్ మెంట్ ముందు పేజీలో ఘనంగా వేస్తారు, తర్వాతి రోజు విద్యాదీవెన కార్యక్రమం మాత్రం ప్రతిపక్షాల పోరాటాల కంటే తక్కువ స్థాయి వార్తగా మారిపోతుంది. ఇదెక్కడి లాజిక్.
ఈ విషయంలో ఈనాడు-ఈటీవీ ఎప్పుడో గాడితప్పాయి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఈనాడు యాజమాన్యానికి సంక్షేమం కంటే వివాదాలే ఎక్కువ కావాలి. నాటుసారా తాగి మరణించారనే వార్త కంటే.. అక్కడ టీడీపీ నేతలు, మరీ ముఖ్యంగా లోకేష్ చేస్తున్న హంగామా ఈటీవీ-ఈనాడుకు ఎక్కువైంది.
టీడీపీ నేతలు చేసిన నిరసన కార్యక్రమం, లోకేష్ మాట్లాడిన వీడియోలు ప్రసారం చేసిన తర్వాత మాత్రమే.. జగన్ విద్యాదీవెన కార్యక్రమాన్ని టచ్ చేసింది. రాత్రి ఈటీవీ 9 గంటల వార్తల్లో, ఈరోజు ఉదయం ఈనాడు పేపర్ లో ఇదే పద్ధతి కనిపించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఇదే పరిస్థితి. ఏపీ ముఖ్యమంత్రి ఎంత పెద్ద కార్యక్రమంలో పాల్గొన్నా ఎక్కడో వెనక పేజీల్లోకి వెళ్లిపోతారు, నారా లోకేష్ లేదా చంద్రబాబు చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా అది ఫ్రంట్ పేజీలోకి వచ్చేస్తుంది.
బాబు అధికారంలో ఉంటే..
చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మద్యపాన నిషేధం అనే కాన్సెప్ట్ ఈనాడుకు గుర్తురాదు. అధికారం వేరేవారి చేతుల్లో ఉంటే మాత్రం ఆటోమేటిగ్గా మద్యపాన నిషేధం అనేది ఈనాడు బ్యానర్ ఐటెం అయిపోతుంది. అవసరమైతే స్వయంగా రామోజీనే ఆ ఉద్యమాన్ని నడిపిస్తారు. వరుసగా కథనాలు ఇస్తారు.
గతంలో వైఎస్ఆర్ జమానాలో ఇలానే చేశారు, ఇప్పుడు జగన్ హయాంలో కూడా అలానే చేస్తున్నారు. చంద్రబాబు ఉన్నప్పుడు మాత్రం మద్యపాన నిషేధం ఈనాడుకి గుర్తు రాకపోవడం విశేషం.
అప్పుడు భేష్..
ఏపీలో రోడ్ల స్థితిగతులు చంద్రబాబు హయాంలోనూ దారుణంగా ఉన్నాయి. కానీ టీడీపీ అనుకూల మీడియా ఆ గోతుల్ని తమ రాతల్తో కప్పి పెట్టింది. వైసీపీ అధికారంలోకి రాగానే ఒక్కసారిగా రోడ్లన్నీ పాడైపోయాయంటూ వార్తలు.
చివరికి మరమ్మతులు ఆలస్యం కావడంతో.. జనం కూడా వైసీపీయే కారణం అనుకునే స్థితికి వచ్చారు. దీనికి అసలు కారణం టీడీపీ అనుకూల మీడియా.
బాబు కట్టలేడు.. జగన్ కట్టి తీరాల్సిందే..
చంద్రబాబు హయాంలో రాజధాని పనులు కేవలం గ్రాఫిక్స్ వరకే పూర్తయ్యాయి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి జగన్ చేతుల్లో పెట్టారు. మరి జగన్ వచ్చీ రాగానే రాజధాని కట్టేయాలట. బాబు అన్నీ తాత్కాలిక బిల్డింగ్ లతో సరిపెడితే, జగన్ మాత్రం రెండేళ్లలోనే అన్నీ పూర్తి చేయాలట. ఇదెక్కడి లాజిక్.
ఐదేళ్లలో చంద్రబాబుపై ఏ విషయంలోనూ ఒత్తిడి తెస్తూ రాతలు రాయని పచ్చమీడియా.. ఇప్పుడు జగన్ వచ్చేసరికి అన్నిట్నీ భూతద్దంలోనే చూస్తోంది. జనం కూడా అలానే చూడాలని ఆశిస్తోంది.
అందుకే అన్నారేమో జగన్..
చంద్రబాబుతో పాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 గోబెల్స్ ప్రచారంపై యుద్ధం చేయాలని ఇటీవలే చెప్పారు జగన్. ఆ దిశగా పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేశం చేశారు. పైకి నిస్పక్షపాతంగా వార్తలిస్తామని చెప్పుకుంటున్నా.. లోపల అజెండా మాత్రం వేరే ఉంటుంది. ఎన్నికలు దగ్గరపడ్డ ఈ సమయంలో ఇది మరింత విచ్చలవిడిగా మారుతోంది.
కడపజిల్లాకు చెందిన వైఎస్ వివేకా హత్య కేసుకి సంబంధించి టీడీపీ అనుకూల మీడియా ఎంత యాగీ చేసిందో, చేస్తోందో అందరికీ తెలుసు. సీబీఐ ఎంక్వయిరీ జరుగుతున్నా కూడా సమాంతరంగా టీడీపీ అనుకూల మీడియా మరో ఎంక్వయిరీ మొదలు పెట్టింది. పదే పదే అదే అబద్ధాన్ని జనంపై రుద్ది.. నిజమేనేమో అనే భ్రమ కల్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. దీన్ని అడ్డుకోవావడం చాలా కష్టం.
అందుకే జగన్ ఎమ్మెల్యేలతో జరిగిన వైసీఎల్పీ మీటింగ్ లో ఈ విషయాన్ని నొక్కిమరీ చెప్పారు. పచ్చపాత మీడియాకు సంక్షేమం అస్సలు వద్దు, వివాదాలే ముద్దు… ఎన్నికల టైమ్ కి ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందో.