ప‌వ‌న్ బ‌ల‌హీన‌త‌… ప‌సిగ‌ట్టిన‌ బాబు!

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌ల‌హీన‌తను చంద్ర‌బాబునాయుడు ప‌సిగ‌ట్టారు. స‌హజంగా సినిమా వాళ్లు పొగ‌డ్త‌ల‌కు ప్ర‌స‌న్న‌మవుతారు. ఇత‌ర‌త్రా విష‌యాల‌తో వారికి ప‌ని ఉండ‌దు. ఇందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అతీతుడేమీ కాదు. ఎవ‌రైనా ఒక విమ‌ర్శ చేస్తే సినీ సెల‌బ్రిటీలు…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ బ‌ల‌హీన‌తను చంద్ర‌బాబునాయుడు ప‌సిగ‌ట్టారు. స‌హజంగా సినిమా వాళ్లు పొగ‌డ్త‌ల‌కు ప్ర‌స‌న్న‌మవుతారు. ఇత‌ర‌త్రా విష‌యాల‌తో వారికి ప‌ని ఉండ‌దు. ఇందుకు ప‌వ‌న్‌క‌ల్యాణ్ అతీతుడేమీ కాదు. ఎవ‌రైనా ఒక విమ‌ర్శ చేస్తే సినీ సెల‌బ్రిటీలు జీర్ణించుకోలేరు. ఈ విష‌యంలో ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఎక్కువ ఓవ‌ర్ రియాక్ట్ అవుతుంటారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌సంగాల‌ను ప‌రిశీలిస్తే… త‌న‌ను ఫ‌లానా నాయ‌కుడు ఇలా విమ‌ర్శించాడు, అలా విమ‌ర్శించాడంటూ పేరుపేరునా హెచ్చ‌రిక‌లు చేయ‌డాన్ని గుర్తించొచ్చు. త‌న‌ను క‌నీసం ప్ర‌శంసించ‌క‌పోయినా విమ‌ర్శించ‌ని వాళ్లపై ప‌వ‌న్ గౌర‌వాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంటారు. 

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు స‌హ‌జ‌మ‌ని, వాటిని వ్య‌క్తిగ‌తంగా తీసుకోవ‌ద్ద‌నే క‌నీస స్పృహ ప‌వ‌న్‌లో కొర‌వ‌డింది. ప‌వ‌న్ సినీ నేప‌థ్యం, సామాజిక బ‌లం రీత్యా… రాజ‌కీయంగా వాడుకునేందుకు బాబు వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపారు. అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా ప‌వ‌న్‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ వ‌చ్చారు.

ప‌వ‌న్‌కు కావాల్సింది ఇదే. రాష్ట్రం, స‌మాజ ప్ర‌యోజ‌నాల‌ని ప‌వ‌న్ మాట్లాడుతుంటారే త‌ప్ప‌, వాటి గురించి అవ‌గాహ‌న‌, నిబ‌ద్ధ‌త ప‌వ‌న్‌లో ఉన్నాయ‌ని ఎవ‌రైనా భావిస్తే… నేతి బీర‌కాయలో నెయ్యి, ఎండ‌మావుల్లో త‌డి ఎంత నిజ‌మో, జ‌న‌సేనాని విష‌యంలో కూడా అవి అంతే వాస్త‌వం. 

వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ విష‌యానికి వ‌స్తే… ఇలాంటి లౌక్యం అస‌ల్లేదు. నాయకుల‌ను, మేనేజ్‌మెంట్‌ను, లోపాయికారి ఒప్పందాల‌ను న‌మ్ముకోవ‌డం లాంటి వాటికి జ‌గ‌న్ పుట్టుక‌తోనే వ్య‌తిరేకి. ఎంత‌సేపూ ప్ర‌జ‌లు, దేవుడిపై ఆయ‌న అపార న‌మ్మ‌కం, విశ్వాసం.

అరె క‌నిపించే క‌నిపించే దేవుడైన త‌న‌ను జ‌గ‌న్ ప‌ట్టించుకోక‌పోవ‌డం ఏంట‌నేది ప‌వ‌న్‌క‌ల్యాణ్ ఈర్ష్య‌, అసూయ‌. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో తాను అడిగే వాడిని కాద‌ని, ఇచ్చేవాడిని మాత్ర‌మే అని చెప్పుకొచ్చారు. ప‌ది మందికి పెట్టేవాడినే త‌ప్ప‌, దోచుకునే మ‌న‌స్త‌త్వం కాద‌ని ప్ర‌గ‌ల్భాలు ఆర్భాటంగా చెప్పారు. ఈ మాట‌ల్లో ప‌వ‌న్ మ‌న‌స్త‌త్వాన్ని ప‌సిగ‌ట్టొచ్చు. 

చంద్ర‌బాబు ల‌వ్ ప్ర‌పోజ‌ల్‌ను ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. చంద్ర‌బాబు అడిగారు కాబ‌ట్టి, తాను మ‌ద్ద‌తు ఇస్తాన‌నేది ఆయ‌న మాట‌ల్లోని ఆంత‌ర్యం.

జ‌గ‌న్ మాత్రం నువ్వేంటి ఇచ్చేద‌నే ధిక్క‌ర‌ణ మ‌న‌స్త‌త్వం. ఏదైనా ప్ర‌జ‌ల‌నే అడుగుతా త‌ప్ప‌, మ‌రెవ‌రి ఎదుట త‌ల వంచ‌న‌నే జ‌గ‌న్ ఆత్మాభిమాన‌మే ప‌వ‌న్‌కు శ‌త్రువు చేసింది. 

కేవ‌లం త‌న వెనుక ఉన్న సామాజిక ఓటు బ్యాంక్‌పై త‌ప్ప‌, త‌న‌పై బాబుకు, టీడీపీకి ప్రేమ లేద‌ని మ‌రోసారి తెలియ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌దు. ప‌వ‌న్ బ‌ల‌హీన‌త మ‌న‌స్త‌త్వం చివ‌రికి ఆయ‌న సామాజిక వ‌ర్గాన్ని నిలువునా ముంచుతుంద‌నేది వాస్త‌వం.