వివేకా కేసులో సీబీఐకి హైకోర్టు షాక్‌

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసును విచారిస్తున్న సీబీఐకి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఏ1 నిందితుడు ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో సీబీఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ సంస్థ‌కు…

మాజీ మంత్రి వివేకా హ‌త్య కేసును విచారిస్తున్న సీబీఐకి హైకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసులో ఏ1 నిందితుడు ఎర్ర‌గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని హైకోర్టులో సీబీఐ దాఖ‌లు చేసిన పిటిష‌న్‌పై విచార‌ణ సంస్థ‌కు ప్ర‌తికూల తీర్పు వ‌చ్చింది. గంగిరెడ్డి బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో సీబీఐకి న్యాయ‌స్థానంలో చుక్కెదురైంది.

వివేకా హ‌త్య కేసులో ఆయ‌న ముఖ్య అనుచ‌రుడు ఎర్ర‌గంగిరెడ్డిపై అనుమానంతో సిట్ అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత ఆయ‌న‌కు న్యాయ‌స్థానం బెయిల్ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఆదేశాల మేర‌కు సీబీఐ ద‌ర్యాప్తు చేప‌ట్టింది. 

ఏ1 నిందితుడిగా ఎర్ర‌గంగిరెడ్డితో పాటు మ‌రో న‌లుగురిని కూడా సీబీఐ నిందితులుగా తేల్చింది. వీరిలో సునీల్ యాద‌వ్‌, ఉమాశంక‌ర్‌రెడ్డి, దేవిరెడ్డి శంక‌ర్‌రెడ్డి మాత్ర‌మే జైల్లో ఉన్నారు. మ‌రో నిందితుడు ద‌స్త‌గిరి అప్రూవ‌ర్‌గా మారి, ప్ర‌స్తుతం ఇంటి ద‌గ్గ‌రే ఉన్నాడు. అత‌నికి ప్ర‌భుత్వం ర‌క్ష‌ణ కూడా క‌ల్పించింది.

ఇదిలా వుండ‌గా సాక్షుల‌ను గంగిరెడ్డి బెదిరిస్తున్నాడ‌ని, బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కోరుతూ హైకోర్టులో సీబీఐ పిటిష‌న్ దాఖ‌లు చేసింది. సీబీఐ ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని, సాక్షుల‌ను బెదిరిస్తున్నార‌ని రుజువు చేసే ఆధారాలు కూడా లేవ‌ని గంగిరెడ్డి త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. 

సాక్షుల‌ను బెదిరిస్తున్నాడ‌నేందుకు ఆధారాలు వుంటే కోర్టు ముందు ఉంచాల‌ని సీబీఐని హైకోర్టు కోరింది. కానీ సీబీఐ ఎలాంటి ఆధారాలు చూప‌క‌పోవ‌డంతో బెయిల్ ర‌ద్దు చేయాల‌నే పిటిష‌న్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో గంగిరెడ్డికి ఊర‌ట ల‌భించిన‌ట్టైంది.