కేసీఆర్ సర్కారు గాలి తీసేసిన హైకోర్టు!

అధికారంలో ఉన్న నాయకులు.. అయినవారికి అప్పనంగా దోచిపెట్టడం అనేది భూకేటాయిపుల రూపంలోనే దండిగా జరుగుతుంటుందని మనకు తెలుసు. వందల వేల కోట్ల రూపాయల దోపిడీల పర్వం ఇలా గుట్టుచప్పుడు కాకుండా భూకేటాయింపుల రూపంలోనే జరిగిపోతూ…

అధికారంలో ఉన్న నాయకులు.. అయినవారికి అప్పనంగా దోచిపెట్టడం అనేది భూకేటాయిపుల రూపంలోనే దండిగా జరుగుతుంటుందని మనకు తెలుసు. వందల వేల కోట్ల రూపాయల దోపిడీల పర్వం ఇలా గుట్టుచప్పుడు కాకుండా భూకేటాయింపుల రూపంలోనే జరిగిపోతూ ఉంటుంది. అయితే అందులోనైనా కొంచెం ధర్మసమ్మతంగా, నమ్మశక్యంగా ఉండేలా.. కాస్త నిబంధనలను ప్రభుత్వాలు పాటిస్తుంటాయి. 

అయితే కేసీఆర్ సర్కారు.. అడ్డగోలుగా చేసిన కేటాయింపులు ఇప్పుడు వారి పరువు తీసేస్తున్నాయి. హెటెరో పార్థసారథిరెడ్డి కి చెందిన సంస్థలకు చేసిన భూ కేటాయింపులను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. హెటిరో పార్థసారధిరెడ్డికి చెందిన సాయిసింధు ఫౌండేషన్ కు భూకేటాయింపులు జరిగిన విధానాన్ని గమనిస్తే అప్పనంగా పళ్లెంలో పెట్టి అప్పగించినట్టుగా ఉన్నదని కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం.

హెటెరో పార్థసారధిరెడ్డికి చెందిన ఈ ఫౌండేషన్ కోసం 2018లో కేసీఆర్ సర్కారు 15 ఎకరాల భూమిని లీజు ప్రాతిపదికన కేవలం ఏడాదికి 1.47 లక్షల లీజు ధరకు కేటాయించింది. అప్పటికి ముప్పయ్యేళ్ల ముందు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రికోసం ఏడున్నర ఎకరాలను కేటాయించినప్పుడు నిర్ణయించుకున్న లీజు ధరల మార్గదర్శకాలనే, సాయిసింధు ఫౌండేషన్ కు కేటాయింపులో పాటిస్తున్నట్టు కేసీఆర్ సర్కారు పేర్కొంది. దీనిని కూడా హైకోర్టు తప్పు బట్టింది. 

సాయిసింధు సంస్థకు కేటాయించిన భూములు శేరిలింగంపల్లి పరిధిలోని ఖానామెట్ పంచాయితీ కిందకు వస్తాయి. ఇక్కడ ఎకరా యాభైకోట్ల నుంచి వందకోట్ల వరకు విలువ ఉంటుంది. 15 ఎకరాలు అంటే.. కొన్ని వందల కోట్ల విలువైన భూమిని కేవలం ఏడాదికి 1.47 లక్షల రూపాయల లీజుకు ఇవ్వడం అనేది పెద్ద కామెడీ.

ఈ వ్యవహారంపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు తుదితీర్పు ఇచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు కెల్లా అక్కడ ఆస్పత్రి నిర్మాణం పూర్తవుతుందని హెటెరో తరఫు న్యాయవాదులు వాదించారు. కాబట్టి ఈ దశలో భూకేటాయింపుల గురించి జోక్యం చేసుకోవద్దని వారు కోరారు. ఈ వాదనల్ని హైకోర్టు తోసిపుచ్చింది. 2021 ఫిబ్రవరిలోనే కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో ఏ నిర్మాణం జరిగిన తుది తీర్పునకు లోబడే ఉంటుందని హెచ్చరించడం విశేషం. దానిని ఇప్పుడు ప్రస్తావించింది. నిర్మాణం పూర్తవుతున్నది గనుక.. నిబంధనల ఉల్లంఘనను విస్మరించలేమనే విషయాన్ని కోర్టు గుర్తుచేసింది.

ఈ తీర్పుతో హైకోర్టు కేసీఆర్ సర్కారు.. అయినవాళ్లకు దోచిపెట్టే అడ్డదారులను తీవ్రంగా తప్పుపట్టినట్టే. ప్రభుత్వం గాలి తీసినట్టే. అధికారంలో ఉన్నవాళ్లకు వాటాలు, వందల కోట్ల ముడుపులు సమర్పించుకుంటే యథేచ్ఛగా దోచుకోవచ్చుననే ఆలోచన ఉండే వారికి ఈ కోర్టు చెంపపెట్టు అని పలువురు భావిస్తున్నారు.