9 ఏళ్లయింది.. ఇంతేనా పవన్ మీ పార్టీ బలం?!

రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత.. ఎంతకాలానికైనా సరే.. దాని అంతిమలక్ష్యం అధికారమే. వారు చేసే ప్రయత్నాలు, పడే కష్టం, తలపెట్టే పనులు, వేసే అడుగులు, ప్రవచించే సిద్ధాంతాలు అన్నీ అధికారం దిశగానే! ప్రాంతీయ పార్టీల…

రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత.. ఎంతకాలానికైనా సరే.. దాని అంతిమలక్ష్యం అధికారమే. వారు చేసే ప్రయత్నాలు, పడే కష్టం, తలపెట్టే పనులు, వేసే అడుగులు, ప్రవచించే సిద్ధాంతాలు అన్నీ అధికారం దిశగానే! ప్రాంతీయ పార్టీల విషయానికి వస్తే.. వ్యక్తిస్వామ్యంగా అవి ఉంటాయి. 

వ్యక్తిపూజ ఎక్కువగా ఉంటుంది. చాలా వరకు ప్రాంతీయ పార్టీలు వ్యక్తి ఇమేజి చుట్టూ అల్లుకుని మనుగడ సాగిస్తుంటాయి కూడా. వాటి సిద్ధాంతాల బలం జత కాకుండా, వ్యవస్థాగతమైన బలం ఏర్పడకుండా అదే రీతిగా ఉన్నంతవరకు.. వాటికి భవిష్యత్తు మాత్రమే కాదు, వర్తమానం కూడా అంధకార బంధురంగానే ఉంటుంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ అధ్యక్షుడుగా ఆయన స్థాపించిన జనసేన పార్టీ పరిస్థితి అలాగే కనిపిస్తోంది. 

జనసేన పార్టీని పెట్టి 9 సంవత్సరాలు గడిచాయి. 9వ ఆవిర్భావదినోత్సవాన్ని పవన్ కల్యాణ్ చాలా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏయే అంశాలు లేవనెత్తారు. ప్రజలకు ఏయే వాగ్దానాలు చేశారు. ఈ వ్యవహారాన్నంతా పక్కన పెట్టండి.. ‘ఆ వేదిక మీద ఎవరెవరు ఉన్నారు?’ అనే ఒక్క విషయాన్ని గమనిస్తే.. అసలు పవన్ కల్యాణ్ పార్టీ బలం ఇంతేనా? అని అనుమానం కలగకమానదు. 2024లో అధికారంలోకి వచ్చేది మేమే అని జంబంగా పలికే పవన్ కల్యాణ్ పరిస్థితి చూసి జాలి కలగక మానదు. 

ఇప్పటంలో పవన్ కల్యాణ్ కోసం చాలా విశాలమైన వేదికను నిర్మించారు. వేదిక విశాలమైనదే.. కానీ దానిమీద ఎంతమందైనా కూర్చోడానికి తగిన బలమైన వేదిక. కానీ.. ఎందుకు కూర్చున్నారు? అనేది గమనిస్తే పార్టీ ఎంతటి దుస్థితిలో ఉన్నదో అర్థమైపోతుంది. 

ఒక పార్టీకి సంబంధించి ఇలాంటి ప్రధానమైన కార్యక్రమం జరిగినప్పుడు.. ఆ పార్టీకి ఉన్న దిగ్గజాలవంటి నాయకులందరూ వేదిక మీదికి వస్తారు. ఇంతటి మహామహులందరూ ఈ పార్టీ నాయకులు.. అనే భావన ప్రజలకు కలిగేలా వ్యవహరిస్తారు. అదంతా పార్టీ బలంగా ప్రజల్లో ఒక భ్రమను పుట్టిస్తారు. 

కానీ.. ఈ ఇప్పటం వేదిక మీద పవన్ కల్యాణ్ కాకుండా ఇద్దరంటే ఇద్దరే వ్యక్తులు ఉన్నారు. ఒకరు నాదెండ్ల మనోహర్, మరొకరు నాగేంద్రబాబు! ఉండడానికి ఇంకా పదుల సంఖ్యలో కూడా ఉన్నారు. వారంతా పార్టీలో సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ నాయకుల కింద అనుకోవాలి. అలా ఓ యాభై మందిని వేదిక మీద కాస్త ఎడంగా కూర్చోబెట్టారు. 

ప్రధాన వేదిక మీద మూడే కుర్చీలు. జనసేనానికి ఒకటి. నాదెండ్లకు, నాగబాబుకు చెరొకటి. ఈ ఇద్దరిలో నాగబాబును మనం రాజకీయ నాయకుడిగా అసలు గుర్తించగలమా? ఆయనంతటి హోప్ లెస్, యూజ్ లెస్ రాజకీయ నాయకుడు మరొకడు ఉండరు. తమ్ముడే పార్టీ పెట్టాడు కదా అని.. ఎంపీగా పోటీచేసి.. ప్రజలు ఓడించిన వెంటనే.. ఇక రాజకీయాలను సాంతం గాలికొదిలేసి, టీవీషోలు వ్యాపారాలు చేసుకుంటూ బతుకుతూ ఉన్న నాగబాబు.. ఇవాళ హఠాత్తుగా మళ్లీ ప్రధాన వేదిక మీదికి వచ్చాడు. 

నాగబాబు తనకు చిన్నతనంలో ఇచ్చిన పుస్తకం కారణంగానే.. తాను నాయకుడిని అయ్యానని పవన్ జనరంజకంగా ఒక డైలాగు చెప్పారు కూడా. ఆ పుస్తకం ఇవ్వడం తప్ప జనసేన నాయకుడిగా నాగబాబుకు మరొక అర్హత లేదు. నాదెండ్ల సంగతి సరేసరి. 

వీరిద్దరూ తప్ప ఆ పార్టీకి చెప్పుకునేంత నాయకుడు ఇంకొకరు లేరు అని ఈ కార్యక్రమం నిరూపించింది. 9ఏళ్ల కిందట పుట్టిన పార్టీకి.. సీనియర్లు, అనుభవజ్ఞులు పార్టీకి కీర్తిగా ఉపయోగపడేవారు అనుకునే తరహా నాయకులు ఆ పార్టీలో ఒక్కరు కూడా లేరు. ఎంతటి దయనీయమైన పరిస్థితి ఇది. 

షూటింగులు లేనప్పుడు తాను, షూటింగులు ఉన్నప్పుడు నాదెండ్ల మనోహర్ ప్రజల మధ్య తిరిగితే చాలు.. పార్టీ అధికారంలోకి వచ్చేస్తుంది అని పవన్ కల్యాణ్ అనుకుంటున్నాడంటే.. ఎంత ఘోరం అది. ప్రజలంటే ఆయనకు ఎంత చులకన. ఆ మాటకొస్తే నాగబాబు ఈ వేదిక మీద ఆ స్థానంలో కూర్చోదగిన నాయకుడు కానే కాదు.

కాకపోతే.. వేదిక మీద పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇద్దరు మాత్రమే ఉంటే.. పవన్ మరియు నాదెండ్ల ఇద్దరూ సమానం అని ప్రజలు అనుకుంటారనే భయంతో నాదెండ్లకు జోడీగా నాగబాబును కూర్చోబెట్టినట్టుగా ఉంది. వేదిక మీద కూర్చోడానికి పట్టుమని పదిమంది నాయకులు కూడా లేని పార్టీ.. ఇంకో రెండేళ్లలో అధికారంలోకి వచ్చేస్తుందిట. 

ఏంటి పవన్ కల్యాణ్ గారూ ఇది. కామెడీ కాకపోతే?