ఆర్ఆర్ఆర్ ఓకే.. చిరు, మహేష్ సినిమాల సంగతేంటి?

ఆర్ఆర్ఆర్ ముందు వరకు ఒక పరిస్థితి. ఆర్ఆర్ఆర్ తో ఏపీలో మరో పరిస్థితి కనిపించబోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఏపీ సర్కారు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. …

ఆర్ఆర్ఆర్ ముందు వరకు ఒక పరిస్థితి. ఆర్ఆర్ఆర్ తో ఏపీలో మరో పరిస్థితి కనిపించబోతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఈ భారీ బడ్జెట్ సినిమాకు ఏపీ సర్కారు ప్రత్యేక అనుమతి ఇచ్చింది. 

టికెట్ పై వంద రూపాయలు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో ఆర్ఆర్ఆర్ రిలీజయ్యే థియేటర్లలో కనిష్టంగా 120 రూపాయలు, గరిష్టంగా 265 రూపాయలు టికెట్ రేటు ఉండబోతోంది. మరి ఇదే పరిస్థితి ఆర్ఆర్ఆర్ తర్వాత రిలీజ్ అవ్వబోయే సినిమాలకు కూడా ఉంటుందా?

రెమ్యూనరేషన్లు కాకుండా, ప్రొడక్షన్ కాస్ట్ వంద కోట్లు దాటిన బడ్జెట్ సినిమాలకు ప్రత్యేక అనుమతులు ఉంటాయని ఏపీ ప్రభుత్వం ముందు నుంచి చెబుతూ వస్తోంది. ఆ అనుమతులు ఎలా ఉంటాయనే విషయం ఆర్ఆర్ఆర్ రిలీజ్ తో అందరికీ క్లారిటీ వచ్చింది. 

అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత చిరంజీవి నటించిన ఆచార్య, మహేష్ బాబు సర్కారువారి పాట సినిమాలొస్తున్నాయి. ఇవి కూడా భారీ బడ్జెట్ సినిమాలే. మరి చిరంజీవి, మహేష్ బాబు సినిమాలకు కూడా ఇలాంటి ప్రత్యేక అనుమతులు ఉంటాయా?

ఇలా ప్రతి సినిమా విడుదలకు ముందు పెద్ద హీరోలంతా వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం, అనుమతులు తెచ్చుకోవడం అనేది సరైన పద్ధతి కాదు. దీనికి సంబంధించి మార్గదర్శకాల్ని ఎంత త్వరగా విడుదల చేస్తే అంత మంచిది.

బెనిఫిట్ షోలపై ఇప్పటికే అనుమానాల్ని నివృత్తి చేసిన ప్రభుత్వం, పెయిడ్ ప్రివ్యూలపై కూడా నియమనిబంధనల్ని గైడ్ లైన్స్ లో పొందిపరిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. గైడ్ లైన్స్ వచ్చేస్తే, ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు, థియేటర్ల నిర్వహణపై ఇన్నాళ్లుగా నెలకొన్న సందిగ్దత, అనుమానాలకు తెరపడినట్టే.