ఆర్ఆర్ఆర్ కు ప్రతి రోజూ బెనిఫిట్ షో – రాజమౌళి

ఆర్ఆర్ఆర్ పెయిడ్ ప్రివ్యూలకు సంబంధించి ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఈరోజు లేదా రేపు వీటిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు బెనిఫిట్ షోలపై రాజమౌళి స్పందించాడు. తమ సినిమాకు ప్రతి రోజూ…

ఆర్ఆర్ఆర్ పెయిడ్ ప్రివ్యూలకు సంబంధించి ఇంకా చర్చలు సాగుతున్నాయి. ఈరోజు లేదా రేపు వీటిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు బెనిఫిట్ షోలపై రాజమౌళి స్పందించాడు. తమ సినిమాకు ప్రతి రోజూ ఓ బెనిఫిట్ షో ఉంటుందంటున్నాడు. ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు థ్యాంక్స్ చెప్పాడు జక్కన్న.

“ప్రభుత్వం మాకు 5 షోలకు అనుమతి ఇచ్చింది. కాబట్టి ఏదో ఒక రోజు బెనిఫిట్ షో ఇచ్చినట్టు కాదు, అన్ని రోజులు మాకు బెనిఫిట్ షో ఇచ్చినట్టయింది. ఇక పెయిడ్ ప్రివ్యూలకు సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుపుతున్నాం. ఏపీ, తెలంగాణలోని కీలకమైన అన్ని సెంటర్లలో పెయిడ్ ప్రివ్యూలు వేసే ఆలోచనలో ఉన్నాం. కానీ దానికి సంబంధించి ఎక్కడికక్కడ అనుమతులు తీసుకోవాలి. మా డిస్ట్రిబ్యూటర్లు ఆ ప్రయత్నాల్లోనే ఉన్నారు. మరో 2 రోజుల్లో క్లారిటీ వస్తుంది.”

ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాకు టికెట్ రేట్ పై వంద రూపాయలు పెంచుకునేలా ప్రత్యేక అనుమతి ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ సర్కారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చొరవకు కృతజ్ఞత తెలిపిన రాజమౌళి.. సినిమాను జగన్ అర్థం చేసుకున్న విధానం చాలా బాగుందని మెచ్చుకున్నారు.

“ఆర్ఆర్ఆర్ కోసం ప్రత్యేకంగా ముఖ్యమంత్రితో మాట్లాడాం. సీఎం గారు చాలా క్లియర్ గా ఉన్నారు. రేట్లపై ఇంత పెంచుకోండి, ఇంత తగ్గించుకోండి అని చెప్పలేదు. జీవో ఆల్రెడీ ఉంది కాబట్టి దాని ప్రకారమే అంతా జరగాలన్నారు. పెద్ద బడ్జెట్ తో సినిమా తీశారు కాబట్టి నష్టాలు రాకూడదనే విషయాన్ని సీఎం అర్థం చేసుకున్నారు. అదే టైమ్ లో ప్రేక్షకులపై కూడా ఎక్కువ భారం పడకూడదన్నారు. దానికి తగ్గట్టే రేటు ఫిక్స్ చేశారు. ముఖ్యమంత్రి గారు చాలా తక్కువ టైమ్ లోనే సినిమా సమస్యలు అర్థం చేసుకొని, అన్నింటినీ క్లియర్ చేస్తూ వస్తున్నారు.”

కొత్త జీవోపై నెలకొన్న గందరగోళాన్ని కాస్త క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు రాజమౌళి. జీవో వచ్చినప్పటికీ గైడ్ లైన్స్ ఇంకా రాలేదని, అందుకే చాలామందిలో గందరగోళం నెలకొందన్న రాజమౌళి.. ఇలాంటి టైమ్ లో ఏదో ఒక కామెంట్ చేసి వివాదాలు సృష్టించకూడదని అందర్నీ కోరాడు.