ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు అసమర్థుల పొత్తు యాత్ర సర్వత్రా చర్చకు దారి తీసింది. ఆ ఇద్దరు నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్. ఒకరేమో టీడీపీ, మరొకరు జనసేన అధినేతలు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవడం చేతకాదని ఇద్దరూ కలిసి పనిచేయాలనే ఆలోచన ద్వారా ఏపీ సమాజానికి చెప్పకనే చెప్పారు.
తన అనుభవమంత వయసు కూడా వైఎస్ జగన్‌కు లేదని, కుర్రకుంక అని జగన్‌ను ఉద్దేశించి చంద్రబాబు పలు సందర్భాల్లో విమర్శించారు. నిజమే, జగన్ తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు రాజకీయ సమకాలికులు.
చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న తెలుగుదేశం పార్టీది నాలుగు దశాబ్దాల చరిత్ర. జగన్ సారథ్యం వహిస్తున్న వైఎస్సార్‌సీపీది కేవలం 12 ఏళ్ల చరిత్ర. 1983 నుంచి ఏపీ సమాజాన్ని అత్యధిక కాలం టీడీపీనే పాలించింది. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారం చెలియించి చరిత్ర సృష్టించారు.
2024లో చంద్రబాబుతో కలిసి పొత్తు కుదుర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్న పవన్‌కల్యాణ్ జనసేన స్థాపించి 9 ఏళ్లు అవుతోంది. ఈ తొమ్మిదేళ్లలో కనీసం తాను ఎమ్మెల్యేగా కూడా గెలవలేని దుస్థితి. చంద్రబాబు అధికార పల్లకీ మోయడానికి, జగన్‌ను రాజ కీయంగా బద్నాం చేయడానికే రాజకీయ పంథా సాగిస్తున్న నాయకుడు పవన్‌కల్యాణ్.
జనసేన ఆవిర్భావ సభలో పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తానని పవన్‌కల్యాన్ ముందే ప్రకటించడంతో ఆవిర్భావ సభకు ప్రాధాన్యం ఏర్పడింది. సభ ముగింపులో పవన్ అసలు విషయాన్ని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చనని, జగన్‌ను ఓడించడానికి బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇవ్వాలని కోరడం సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
జగన్‌ను ఓడించడానికి చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని ధైర్యంగా చెప్పుకోలేని పిరికితనాన్ని పవన్‌లో చూడొచ్చు. చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకుంటానని పవన్ ఎందుకని బహిరంగంగా ప్రకటించలేకపోతున్నారు. చంద్రబాబుతో కలిసి పని చేస్తానని చెప్పడానికి అవమానంగా ఎందుకు భావిస్తున్నారు.
జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చననే పవన్ వ్యాఖ్యలకు అర్థమేంటో చెప్పడానికి జనసేన నాయకులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? మరోసారి చంద్రబాబు పల్లకిని మోయడానికి తమ నాయకుడు సిద్ధమయ్యాడని జనసేన కార్యకర్తలు ఎందుకు లోలోన కుమిలిపోతున్నారు?
తన రాజకీయ అనుభవమంత వయసు కూడా లేని జగన్‌ను ఓడించడానికి ఒంటరిగా చేతకాదని, పవన్‌కల్యాణ్ మద్దతు కోరడం రాజకీయ దివాళాతనానికి నిదర్శనమనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. కేవలం మూడేళ్లుగా అధికారం చెలాయిస్తున్న జగన్‌ను, దశాబ్దం క్రితం పార్టీ స్థాపించిన యువ నాయకుడికి అత్యంత ప్రజాదరణ ఉందనే వాస్తవం చంద్రబాబు, పవన్ అనైతిక కలయికే చెబుతోంది.
టాలీవుడ్‌లో అగ్రహీరోగా చెలామణి అవుతున్న పవన్‌కల్యాణ్‌ను రాజకీయ తెరపై మాత్రం జీరో చేసిన ఘనత జగన్‌దే. కనీసం రెండు చోట్ల నిలిచినా గెలవనీయకుండా, అసెంబ్లీలో అడుగుపెట్టకుండా చేశారనే అక్కసు జగన్‌పై పవన్‌లో ఉంది. ఈ దఫా టీడీపీ, బీజేపీ-జనసేన కూటమి పోటీ చేస్తే జగన్‌ను ఎదుర్కోవడం సాధ్యం కాదని, మరోసారి తనకు అసెంబ్లీలో అడుగు పెట్టే యోగం ఉండదనే భయం పవన్‌ను పట్టి పీడిస్తోంది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా రాబోయే రోజుల్లో పొత్తు విషయాన్ని ఆలోచిస్తామని పవన్ అనడం ఆయన రాజకీయ అజ్ఞానానికి నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రెండు నెలల క్రితమే రోడ్‌మ్యాప్ ఇచ్చామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం వెనుక ఉద్దేశం, పవన్‌పై అపనమ్మకమే.
జనసేన-బీజేపీ కలిసి 2024లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అమిత్‌షా రోడ్ మ్యాప్ ఇచ్చారని బీజేపీ నేతలు చెప్పడం విశేషం. బహుశా టీడీపీతో కలిసి ప్రయాణిద్దామనే రోడ్‌మ్యాప్‌ను బీజేపీ నుంచి కోరుకుంటున్నట్టు ఆయన మాటలను బట్టి అర్థం చేసుకోవాలి. ఇది జరగని పని.
ఏపీలో బీజేపీకి ఒక్క సీటు లేకపోయినా, చావోరేవో అధికార, ప్రధాన ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు చేయాలనే ఆశయంతో ముందుకెళుతోంది. కానీ బీజేపీ మిత్రపక్షం జనసేనది మాత్రం ఏకైక లక్ష్యం …జగన్ మోహన్‌రెడ్డిని అధికారానికి దూరం చేయడం. ఈ ఒక్క అంశమే ఇద్దరు అసమర్థులైన నాయకులను ఏకం చేస్తోంది.
పేరుకు రాష్ట్ర ప్రయోజనాలని చెబుతున్నా… ఆచరణ మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అత్యధిక ప్రజాదరణ కలిగిన జగన్‌ను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేకపోవడంతో, అడ్డదారుల్లో వస్తున్న నాయకుల వ్యవహారశైలిని ఏపీ సమాజం జాగ్రత్తగా గమనిస్తోంది.