గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా… మళ్లీమళ్లీ పంజా విసురుతోంది. తాజాగా మరో ఆందోళనకరమైన వార్త ప్రపంచ మానవాళిని భయపెడుతోంది. చైనాలో మరో మహమ్మారి స్టెల్త్ ఒమిక్రాన్ రూపంలో పుట్టుకొచ్చింది. కరోనా మొట్ట మొదటి కేసు చైనాలో బయటపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విస్తరించి ఆర్థికంగా, మానసికంగా చావు దెబ్బతీసింది.
కరోనా ఫస్ట్, ఆ తర్వాత సెకెండ్ వేవ్‌లు ఒకదాని మించి మరొకటి ప్రాణ నష్టాన్ని కలిగించాయి. కరోనా థర్డ్ వేవ్ మాత్రం పెద్దగా ప్రాణాపాయం లేకుండానే వచ్చి వెళ్లిపోయింది. హమ్మయ్య మహమ్మారి బారి నుంచి తప్పించుకున్నామని ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో పిడుగులాంటి వార్త.
చైనాలో తాజాగా 5,280 కొత్త కేసులు నమోదు అయ్యాయి. ఈ ఆందోళనకర పరిణామాలు కేవలం ఆ దేశాన్ని మాత్రమే కాకుండా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. చైనాలో 2020, ఫిబ్రవరి 12 తర్వాత అత్యధిక కరోనా కేసులు నమోదు కావడంతో అప్రమత్తమయ్యారు.
మహమ్మారిని కట్టడి చేసేందుకు ఏకంగా 3 కోట్ల మంది ప్రజల్ని లాక్‌డౌన్‌లో ఉంది. ఇందు కోసం 13 పెద్ద నగరాలను ఎంచుకుంది. ఆ నగరాలకు ప్రజారవాణా సౌకర్యాల్ని నిలిపి వేశారు.
ఇదిలా వుండగా కొత్త వేరియంట్‌పై వైద్య నిపుణులు విస్తృతంగా పరిశోధనలు జరుపుతున్నారు. మూడో వేవ్ కారకమైన వేరియంట్ కంటే స్టెల్త్ ఒమిక్రాన్ 1.5శాతం వేగంగా వ్యాపిస్తున్నట్టు వైద్యశాస్త్రవేత్తలు గుర్తించారు. కరోనా థర్డ్ వేవ్‌తోనే ముప్పు ముగియలేదని చైనా ఉదంతంతో రుజువవుతోంది. కరోనా నుంచి కాపాడుకోవాలంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గం.