ఆర్ఆర్ఆర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు రాజమౌళి, నిర్మాత దానయ్య వెళ్లి ఏపీ సీఎం జగన్ ను కలిశారు. ఆర్ఆర్ఆర్ టికెట్ రేట్లు, పెయిడ్ ప్రివ్యూల విషయంలో వినతిపత్రం అందించారు. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వారు చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మీడియాకు తమ సమావేశం వివరాల్ని చెప్పారు రాజమౌళి.
కానీ ఒక్కటి మాత్రం మిస్ అయింది. అదే ఎన్టీఆర్ వీడియో కాల్. సీఎం జగన్ తో రాజమౌళి భేటీ అయిన సందర్భంలో.. ఎన్టీఆర్ తో వీడియోకాల్ మాట్లాడించారట. సీఎం జగన్ తో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో ఏదో రిక్వెస్ట్ చేశారట. ఇదీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్.
మధ్యలో కొడాలి నాని పేరు..
జగన్ తో రాజమౌళి భేటీ తర్వాత.. సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా పేర్ని నాని స్పందించారు. చాలా విషయాలపై ఆయన మాట్లాడారు. అయితే ఈ భేటీకి మూలకారణం కొడాలి నాని అంటున్నారు చాలామంది. ఎన్టీఆర్, కొడాలి నానిని కోరడం.. నాని రిఫరెన్స్ తోనే రాజమౌళికి జగన్ అపాయింట్ మెంట్ ఇంత ఫాస్ట్ గా దొరికిందని చెబుతున్నారు. దీనిపై రాజమౌళి కూడా క్లారిటీ ఇవ్వలేదు.
రాజమౌళి భేటీకి కొడాలి నాని కారణం అనేది ఒక కోణం అయితే, మీటింగ్ లో రాజమౌళి ఫోన్ ద్వారా జగన్, ఎన్టీఆర్ వీడియో కాల్ లో మాట్లాడుకున్నారనేది తాజా ఊహాగానం. గతంలో జగన్ ని కలసిన చిరంజీవి టీమ్ లో ఎన్టీఆర్ లేరు.
నందమూరి కుటుంబం నుంచి ఎవరూ రాకపోవడంతో దానికి రాజకీయ రంగు పులిమారు కొందరు. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రిలీజ్ టైమ్ దగ్గరపడే సరికి ఎన్టీఆర్, జగన్ కి వీడియో కాల్ లో వివరణ ఇచ్చుకున్నారని అంటున్నారు. అసలు ముఖ్యమంత్రి నిజంగానే ఎన్టీఆర్ తో వీడియో కాల్ మాట్లాడారా, లేక ఇది వట్టి పుకారేనా అనేది తేలాల్సి ఉంది. దీనిపై అటు జగన్ మాట్లాడే ప్రసక్తే లేదు, ఇటు ఎన్టీఆర్ కూడా వివరణ ఇవ్వలేరు. రాగా పోగా రాజమౌళి మాత్రమే దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
బాలయ్య వస్తానన్నారు, ఎన్టీఆర్ ఫోన్ మాట్లాడారు..
గతంలో బాలకృష్ణ అఖండ సినిమా టైమ్ లో జగన్ అపాయింట్ మెంట్ కోరారని ఆమధ్య మహూర్తం లెక్కలతో సహా మీడియాకు వివరించారు మంత్రి పేర్ని నాని. కానీ జగన్ వారించారని కూడా అన్నారు. ఆ వ్యవహారంపై అటు బాలయ్య కూడా స్పందించలేదు.
ఇప్పుడు నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్, సీఎం జగన్ తో వీడియో కాల్ మాట్లాడారని అంటున్నారు. ఎన్టీఆర్ వీడియో కాల్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.