అక్కడ ఏం దక్కుతుందని ఆశపడినట్టు?

కాంగ్రెసు పార్టీలో తనకు టికెటు దక్కడం లేదనే సంగతి అర్థం కాగానే.. పొన్నాల లక్ష్మయ్య రూపంలో మొదటి వికెట్ జాబితా విడుదలకు ముందే పడిపోయింది. పార్టీలో ఎంతో సీనియర్ అయిన, వైఎస్సార్ హయాంలో మంత్రిగా…

కాంగ్రెసు పార్టీలో తనకు టికెటు దక్కడం లేదనే సంగతి అర్థం కాగానే.. పొన్నాల లక్ష్మయ్య రూపంలో మొదటి వికెట్ జాబితా విడుదలకు ముందే పడిపోయింది. పార్టీలో ఎంతో సీనియర్ అయిన, వైఎస్సార్ హయాంలో మంత్రిగా వైభోగం అనుభవించిన, ఆ తర్వాత కూడా పీసీసీ చీఫ్ గా కీలక బాధ్యతలు నిర్వర్తించిన పొన్నాల లక్ష్మయ్య.. ఏకంగా పార్టీకి రాజీనామా చేయడం.. కన్నీళ్లు పెట్టుకోవడం.. పార్టీ మీద నిందలు వేయడం చాలా సహజంగా జరిగిపోయాయి. 

తాజాగా ఆయన ఆదివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ను సతీసమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు. దీంతో.. ఆయన గులాబీకండువా కప్పుకోవడం అనేది ఇక లాంఛనం మాత్రమే.

అయితే పొన్నాల లక్ష్మయ్య గులాబీ పార్టీలోకి వెళ్లడం ద్వారా ఏం దక్కుతుందని ఆశపడుతున్నారో అర్థం కాని సంగతి. ఏ ఎమ్మెల్యే టికెట్ దక్కలేదని తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెసు పార్టీ మీద అలిగి రాజీనామా చేశారో.. ఆ ఎమ్మెల్యే టికెట్ భారాసలో కూడా దక్కే అవకాశం ఎటూ లేదు. టికెట్ల పరంగా భారాసలో పునరాలోచనలేం లేవు. సగం మందికి ఆదివారమే బీఫారాలు కూడా అందాయి. మరో రెండురోజుల్లో మిగిలిన వారికి అందుతాయని కూడా కేసీఆర్ చెప్పేశారు.

అయితే సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య తన తాజా నిర్ణయం ద్వారా మహా అయితే ఎమ్మెల్సీ స్థానం పొందే అవకాశం ఉంది. అయితే, ఆయన తన స్థాయిని చాలా పలుచన చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. కాంగ్రెసు పార్టీ బీసీలకు అన్యాయం చేస్తున్నదని.. బీసీలకు వారి ప్రాధాన్యానికి సరిపడే సంఖ్యలో టికెట్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపణలు చేశారు. అక్కడికేదో తాను జీవితమంతా బీసీల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడిలాగా ఆయన బిల్డప్ ఇచ్చారు. బీసీలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా బయటకు వచ్చినట్లు వెల్లడించారు.

ఇలాంటి నిరసన, తాను టికెట్ కోరకుండా, ఇతర బీసీ నాయకుల గురించిన శ్రద్ధతో తెలిపి ఉంటే బాగుండేది. తనకు టికెట్ దక్కడం లేదని తెలియగానే బీసీ కార్డు ప్లే చేయడం చవకబారు పని. పైగా భారాస ఏమైనా బీసీలను నెత్తిన పెట్టుకున్న పార్టీనా? అంటే అది కూడా లేదు. ఎందుకంటే.. 114లో బీసీలకు కేవలం 19 స్థానాలు మాత్రమే కేసీఆర్ కేటాయించారు. బీసీలకు మేలు చేయడం అనడానికి ఎమ్మెల్యే టికెట్లే కొలబద్ధ అన్నట్టుగా కాంగ్రెసులో ఉండి మాట్లాడిన పొన్నాల, భారాసను ఎలా ఆశ్రయించగలరు?

పైగా పొన్నాలకు టికెట్ నిరాకరించడానికి రేవంత్ రెడ్డి చెప్పిన కారణాలు కూడా సబబైనవే. పీసీసీ చీఫ్ గా ఉంటూ 40 వేల తేడాతో, ఆ తర్వాతి ఎన్నికల్లో 50 వేల తేడాతో ఓడిపోయిన 80 ఏళ్ల వృద్ధ నాయకుడు.. మళ్లీ టికెట్ ఆశించడం అంటే ఏమిటి? తన బదులుగా మరో బీసీ నాయకుడిని అక్కడినుంచి ప్రతిపాదించి ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. ఇప్పుడు పార్టీ మారడం ద్వారా కొంత గౌరవం భంగపడింది. ఈ త్యాగానికి ముందు ముందు అక్కడ ఏం దక్కుతుందో చూడాలి.