కేసీఆర్.. ‘టార్గెట్ కాంగ్రెస్’! తీరుమారిందా?

నిర్మల్ కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేశారు. సభాముఖంగా ప్రసంగం మొదలు పెడితే చాలు.. కమలదళం మీద నిప్పులు చెరగడం కొన్నేళ్లుగా ‘డిఫాల్ట్’…

నిర్మల్ కలెక్టరేట్ ను ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని ఎక్కువగా టార్గెట్ చేశారు. సభాముఖంగా ప్రసంగం మొదలు పెడితే చాలు.. కమలదళం మీద నిప్పులు చెరగడం కొన్నేళ్లుగా ‘డిఫాల్ట్’ అలవాటుగా మార్చుకున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తాజా సభలో మెయిన్ ఫోకస్ మొత్తం కాంగ్రెసు మీదనే పెట్టారు. బిజెపి ప్రస్తావనే తక్కువ. ధరణి పోర్టల్ వద్దంటున్న కాంగ్రెసు నాయకులను బంగాళాఖాతంలో కలిపేయాలని కూడా కేసీఆర్ ఆకాంక్షించారు.

గులాబీ దళపతి తీరు గమనిస్తుంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటేనే ఆయన ఎక్కువగా జడుసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలి పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ పెంచుతున్న దూకుడు.. కర్ణాటకలో వచ్చిన ఫలితాలు.. కాంగ్రెస్ పట్ల ప్రజల్లో సానుకూల ఆలోచన పెరుగుతోందేమో అనే అభిప్రాయాన్ని కేసీఆర్ లో కలిగించినట్లుగా ఉంది. అందుకే ఆయన కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నట్టుగా అనుకోవాల్సి ఉంది.

ఇన్నాళ్లుగా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తాము ఈ ఎన్నికల్లోనే అధికారంలోకి వచ్చేయబోతున్నాం అంటూ ఎంతగా హడావుడి చేసినప్పటికీ తీరా ఎన్నికల ముంగిట్లోకి వచ్చేసరికి ఆ పార్టీ బలహీనతలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సంస్థాగత నిర్మాణం లేకపోవడం, అన్నిచోట్ల పార్టీకి బలం లేకపోవడం, నాయకుల మధ్య ముఠాతగాదాలు అన్నీ కూడా వారికి ప్రతికూలతలు గాని ఉన్నాయి. భాజపా బలహీనతలు బయటకు కనిపించేస్తున్నాయి.

తెలంగాణకు సంబంధించినంత వరకు కాంగ్రెస్ బిజెపిలను పోల్చిచూసినట్లయితే.. బిజెపి తమకు ఉన్న బలం కంటె ఎక్కువ హడావుడి చేస్తున్నదని, కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ముఠాలు వంటి అనేక కారణాల వల్ల ఉన్న బలాన్ని కూడా అంతగా వాడుకోవడం లేదని అనిపిస్తుంది. అయినా సరే.. కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ నే తనకు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినంత వరకు ప్రమాదకారిగా భావిస్తున్నట్టుంది. అందుకే ఆయన కాంగ్రెస్ పై నిందల ఫోకస్ పెంచారని అంతా అనుకుంటున్నారు.

కేసీఆర్ కాంగ్రెస్ గురించే ఎక్కువ భయపడుతున్నారని అనుకోవడానికి బదులుగా ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారి వాస్తవాలను వెల్లడించనున్న నేపథ్యంలో.. బిజెపి మీద కేసీఆర్ కాస్త మెత్తబడ్డ వైఖరి అనుసరిస్తున్నారని, ఎలాంటి చిక్కులు కొనితెచ్చుకోకుండా ఉండాలనుకుంటున్నారని కూడా పలువురు అంచనా వేస్తున్నారు.