14రీల్స్ కు మిగిలింది ఏమిటి?

ఉన్నదీ పాయె..ఉంచుకున్నదీ పాయె అన్నట్లు అయింది 14రీల్స్ సంస్థ పరిస్థితి. దర్శకుడు పరశురామ్ తో తెగతెంపులు అయిపోయినట్లే. ఇచ్చిన లెక్కకు ఊ అని ఓ ముక్క పరశురామ్ అనేస్తే అంతా అయిపోయినట్లే. దాదాపు 13…

ఉన్నదీ పాయె..ఉంచుకున్నదీ పాయె అన్నట్లు అయింది 14రీల్స్ సంస్థ పరిస్థితి. దర్శకుడు పరశురామ్ తో తెగతెంపులు అయిపోయినట్లే. ఇచ్చిన లెక్కకు ఊ అని ఓ ముక్క పరశురామ్ అనేస్తే అంతా అయిపోయినట్లే. దాదాపు 13 నుంచి 14 కోట్లు పరశురామ్ ఇవ్వాల్సి వుంటుంది. 

కానీ అలా అని 14 రీల్స్ కు ఇన్నాళ్ల ఆరాటం తప్ప మిగిలింది లేదు. పాపం. మంచి సంస్థ కానీ ఏనాడూ కోట్లకు కోట్లు డబ్బులు చేసేసుకున్నది లేదు. హిట్ లు కొట్టగా వచ్చిన డబ్బులు ఫ్లాపులు పట్టుకుపోయాయి. సరైన సినిమా కోసం అలా చూస్తూ వుంటే మిగిలిన ఒకే ఒక్క దర్శకుడు పరశురామ్. హీరో నాగ్ చైతన్య-పరశురామ్ సినిమా అనుకుంటే మహేష్ సినిమా అడ్డం పడింది. దానికి పాపం ఏదో మూడు నాలుగు కోట్లు రాయల్టీ వచ్చింది. అది వేరే సంగతి.

ఆ తరువాత మళ్లీ అదే కాంబినేషన్ సినిమా అనుకుంటే చైతన్య-పరశురామ్ లకు సెట్ కాలేదు. పోనీ కార్తీతో చేద్దాం అనుకుంటే ఈసారి దిల్ రాజు ఎగరేసుకుపోయారు. బాలయ్య దయతలచి బోయపాటి సినిమా చేసుకోమంటే..ఇప్పుడు బాబీ సినిమా అడ్డం పడుతోంది. ఇలా ఎటు నుంచి ఎటు వెళ్లినా ల కే ఏత్తం..ద కు కొమ్ము అన్నట్లు తయారయింది పరిస్థితి.

ఆఫీసు మెయింటెయిన్ చేసుకోవడం, వడ్డీలు కట్టుకోవడం మిగిలింది. ఆఖరికి ఇప్పుడు పరుశురామ్ తొ తెగతెంపుల వరకు వచ్చింది. తన కారణంగా ఇప్పటి వరకు ఎంత ఖర్చయింది అన్నవి లెక్కలు కట్టి మరీ సెటిల్ చేసేయడానికి పరశురామ్ రెడీ అయిపోయారు. తనకు ఇచ్చిన అడ్వాన్స్, దానికి అయిన వడ్డీ వెనక్కు ఇవ్వడానికి పరశురామ్ ఒప్పేసుకున్నారు.

కానీ పరశురామ్ తో సినిమా చేయడానికి నాగ్ చైతన్యకు ఇచ్చిన అడ్వాన్స్ కు వడ్డీని కూడా పరశురామ్ నే ఇవ్వ మంటున్నారని తెలుస్తోంది. ఇదెక్కడి న్యాయం అనే పాయింట్, కామెంట్ వినిపిస్తోంది. ఎందుకంటే చైతన్య డేట్ లు వుంచుకుంటే మరో డైరక్టర్ తో వాడుకుంటారు కదా. దానికి పరశురామ్ బాధ్యత ఎంత? అదీ కాక పరశురామ్-మహేష్ సినిమా మీద రాయల్టీ కూడా అందుకున్నారు కదా 14రీల్స్ అధినేతలు. మరి అది మైనస్ చేస్తారా? అన్న ప్రశ్న వుండనే వుంటుంది. 

పోనీ అన్నింటికీ పరశురామ్ ఓకె అంటే 14 రీల్స్ దగ్గర నుంచి చైతన్య డేట్స్ కూడా వెళ్లిపోయినట్లే. పరశురామ్ తమిళ హీరో కార్తీని కూడా ఒప్పించుకున్నాడు. ఇక ఇప్పుడు ఆ ప్రాజెక్టు కూడా వుండదు.

ఇక మిగిలింది ఇప్పుడు చేస్తున్న బెల్లంకొండ‌ శ్రీనివాస్ సినిమా. అన్నీ అనుకూలిస్తే బాలయ్య సినిమా. ఈ ఉదంతంలో కాస్త నష్టం పరశురామ్ కే. ఎందుకంటే తీసుకున్న అడ్వాన్స్ అలా వుంచితే వడ్డీలు, అదనపు భారాల రూపంలో ఆరేడు కోట్లు వెనక్కు ఇచ్చుకోవాలి. దిల్ రాజు నుంచి వచ్చే రెమ్యూనిరేషన్ లో అది కట్ అయిపోతుంది అనుకోవాలి.