ఓట్లు గల్లంతు అంటూ తమ్ముడి గగ్గోలు

ఎన్నికలు ఇంకా రాలేదు కానీ రాజకీయాలు మాత్రం వేడెక్కేస్తున్నాయి. ఏపీలో చూస్తే వైసీపీతో ఫైటింగ్ కి టీడీపీ అన్ని రకాల అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటోంది. విశాఖలో జగన్ గాలిలో కూడా సిటీలో నాలుగు…

ఎన్నికలు ఇంకా రాలేదు కానీ రాజకీయాలు మాత్రం వేడెక్కేస్తున్నాయి. ఏపీలో చూస్తే వైసీపీతో ఫైటింగ్ కి టీడీపీ అన్ని రకాల అస్త్ర శస్త్రాలు రెడీ చేసుకుంటోంది. విశాఖలో జగన్ గాలిలో కూడా సిటీలో నాలుగు అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకుంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అయితే 2009 నుంచి వరసబెట్టి టీడీపీ గెలుస్తోంది. అక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా వెలగపూడి రామక్రిష్ణబాబు ఉన్నారు. ఈసారి ఆయన్ని ఎలాగైనా ఓడించాలని వైసీపీ పట్టుదల మీద ఉంది.

దానికి తగినట్లుగా అభ్యర్ధి సెలెక్షన్ బీసీ సెక్షన్ నుంచి ఉంటుందని అంటున్నారు. తూర్పులో బీసీలు ఎక్కువ. మూడు సార్లు గెలిచిన వెలగపూడి అందులో రెండు సార్లు విపక్షంలో ఉన్నారు. ఒకసారి టీడీపీ అధికారంలో ఉన్నా తూర్పు నియోజకవర్గానికి పెద్దగా జరిగిన మేలు లేదని అంటున్నారు.

సహజంగానే మూడు సార్లు గెలిచిన క్యాండిడేట్ మీద వ్యతిరేకత ఉంటుంది. బీసీలను కూడా పోటీకి పెడితే అగ్ర కులానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే ఓటమి ఖాయమని వైసీపీ భావిస్తోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ అనుకూల ఓట్లను ఓటర్ల జాబితా నుంచి లేపేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే అధికారులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారుతోంది.

వాలంటీర్లు ఎవరు టీడీపీ ఓటరో ఎవరు కాదో తెలుసుకుంటున్నారని, అలా టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తూర్పులో తగ్గించేస్తున్నారు అని వెలగపూడి ఆరోపిస్తున్నారు. దీని మీద అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. నిజంగా అలా జరుగుతోందా అన్నదే ఇపుడు తూర్పులో డిస్కషన్ గా నడుస్తోంది.

ఓటర్ల జాబితాలో పేర్లను తొలగించడం అన్నది కేవలం ఆరోపణగా చేస్తున్నారా నిజంగా అలా జరుగుతోందా అన్నది చూడాల్సి ఉంది. వైసీపీ నాయకులు అయితే ఈసారి తామే తూర్పులో గెలుస్తామని ఓటర్ల గల్లంతు అన్నది టీడీపీ చేస్తున్న చెడు ప్రచారం అని అంటున్నారు. ఇవన్నీ చూస్తూంటే చాలా వ్యూహాత్మకంగానే టీడీపీ ఈ ప్రచారం మొదలెట్టేసింది అని వైసీపీ వర్గాలు అంటున్నాయి.