రోడ్‌మ్యాప్‌పై సోము వీర్రాజు ఏమ‌న్నారంటే…!

వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల్చేసేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ రోడ్‌మ్యాప్ ఇవ్వ‌డ‌మే ఆల‌స్య‌మ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డంపై ఏపీ బీజేపీ ఆచితూచి స్పందించింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థిర‌త్వం లేని రాజ‌కీయ పంథాపై బీజేపీ ఆగ్ర‌హంగా ఉన్న‌ప్పటికీ, ఎక్క‌డా…

వైసీపీ ప్ర‌భుత్వాన్ని కూల్చేసేందుకు భార‌తీయ జ‌న‌తా పార్టీ రోడ్‌మ్యాప్ ఇవ్వ‌డ‌మే ఆల‌స్య‌మ‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప్ర‌క‌టించ‌డంపై ఏపీ బీజేపీ ఆచితూచి స్పందించింది. ప‌వ‌న్‌క‌ల్యాణ్ స్థిర‌త్వం లేని రాజ‌కీయ పంథాపై బీజేపీ ఆగ్ర‌హంగా ఉన్న‌ప్పటికీ, ఎక్క‌డా దాన్ని బ‌య‌ట‌కు ప్ర‌ద‌ర్శించ‌కుండా వ్యూహాత్మ‌క వ్య‌వ‌హ‌రిస్తోంది. రోడ్ మ్యాప్‌పై ప‌వ‌న్ విన్న‌పంపై వ్యూహాత్మ‌క మౌనాన్ని పాటిస్తూ, అలాగ‌ని అస‌లే మాట్లాడ‌లేద‌నే భావ‌న క‌ల‌గ‌కుండా, ముక్త‌స‌రి మాట‌ల‌తో స‌రిపెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇవాళ విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌నా వైఫ‌ల్యాల‌ను ఆయ‌న ఎండ‌గ‌ట్టారు. జ‌న‌సేనాని ప‌వ‌న్ 2024లో జ‌న‌సేన ప్ర‌భుత్వం ఏర్ప‌డుతుంద‌ని, అధికారంలోకి వ‌చ్చాక చేయ‌బోయే ప‌నుల‌ను కూడా వెల్ల‌డించిన నేప‌థ్యంలో ఏపీలో ప్ర‌త్యామ్నాయం ఎవ‌రో సోము వీర్రాజు చెప్పారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌త్యామ్నాయం ఏర్ప‌డాలంటే బీజేపీతోనే సాధ్య‌మ‌ని అధ్య‌క్షుడు సోము వీర్రాజు తేల్చి చెప్పారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని గ‌ద్దె దించాకే ద‌శ‌దిశా ఉన్న ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా వైసీపీ ప్ర‌భుత్వాన్ని అధికారం నుంచి దించేయ‌డానికి బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్న‌ట్టు మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌కు ఆయ‌న స‌మాధానం ఇచ్చారు. ఈ ప్ర‌శ్న‌ను ముందే ఊహించిన సోము వీర్రాజు … ఏ మాత్రం తేడా రాకూడ‌ద‌నే ఉద్దేశంతో ముందే ఓ నోట్‌ను సిద్ధం చేసుకుని వ‌చ్చారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ రోడ్‌మ్యాప్‌పై సోము వీర్రాజు ఏమ‌న్నారో ఆయ‌న మాటల్లోనే తెలుసుకుందాం.

“మా పార్టీ అగ్ర‌నాయ‌కులు అమిత్‌షా రెండు నెల‌ల క్రిత‌మే మాకు తిరుప‌తిలో రోడ్‌మ్యాప్ ఇచ్చారు. జ‌న‌సేన‌, బీజేపీ క‌లిసి 2024లో అధికారంలోకి రావాల‌ని అమిత్‌షా నిర్దేశించారు. ఈ దిశా నిర్దేశం ప్ర‌కారమే మేము రాష్ట్ర వ్యాప్తంగా శ‌క్తి కేంద్రాల‌ను ఏర్పాటు చేసుకుంటూ పార్టీని బూత్‌స్థాయి నుంచి బ‌లోపేతం చేస్తున్నాం. వైసీపీ ప్ర‌భుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై క్షేత్ర‌స్థాయిలో పోరాటాలు నిర్వ‌హిస్తున్నాం. ప‌వ‌న్‌క‌ల్యాణ్ మా మిత్ర‌ప‌క్ష అధ్య‌క్షుడు. ఆయ‌న కేంద్ర పార్టీ ప్ర‌తినిధుల‌తో అన్ని విష‌యాలు మాట్లాడ్తారు” అని స్ప‌ష్టం చేశారు. 

సోము వీర్రాజు త‌న పార్టీ వైఖ‌రిని వెల్ల‌డించిన తీరు చూస్తే…. ప‌వ‌న్‌క‌ల్యాణ్ క‌థేంటో మా అగ్ర‌నేత‌లే చూసుకుంటారు అని చెప్పిన‌ట్టుగా ఉంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌నసేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌పై బీజేపీ ఆచితూచి  స్పందించ‌డాన్ని చూస్తే… అసంతృప్తిగా, ఆగ్ర‌హంగా ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చ‌ని నెటిజ‌న్ల అభిప్రాయం. ముఖ్యంగా టీడీపీతో పొత్తుకు ప‌రోక్షంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డాన్ని బీజేపీ జీర్ణించుకోలేక పోతోంది.