గబ్బర్‌సింగ్ పవన్‌కల్యాణ్ కథ తేల్చేందుకు భారతీయ జనతా పార్టీ సీరియస్‌గా దృష్టి సారించేందుకు సిద్ధమైంది. జనసేన ఆవిర్భావ సభలో వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ పెద్దలు రోడ్ మ్యాప్ ఇవ్వాలని, అందుకోసం అందరితో పాటు తాను ఎదురు చూస్తున్నానని జనసేనాని పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా చెప్పుకొచ్చారు. అయితే పవన్ చేష్టలన్నీ తమకు రోడ్ మ్యాప్ ఇచ్చినట్టుగా ఉందని భారతీయ జనతా పార్టీ నేతలు భావిస్తున్నారని సమాచారం.
అసలే బీజేపీ ప్రస్తావనే లేకుండా అధికారంలోకి వస్తే అది చేస్తాం, ఇది చేస్తామని పవన్‌కల్యాణ్ ఉద్దేశ పూర్వక విస్మరణగా బీజేపీ భావిస్తోంది. పైగా రాష్ట్ర బాధ్యతను తానే తీసుకుంటున్నట్టు పవన్ బిల్డప్ ఇవ్వడం బీజేపీకి కోపం తెప్పించింది. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తే లేదని, అవసరమైతే పొత్తులు పెట్టుకుంటానని చంద్రబాబు ప్రేమ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించడం వెనుక టీడీపీ ఎత్తుగడ వుందని బీజేపీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్లకూడదని బీజేపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఒకవేళ తమను కాదని టీడీపీతోనే జనసేనాని వెళ్లే పక్షంలో, ఏం చేయాలనే అంశంపై బీజేపీ అగ్రనేతలు సీరియస్‌గా దృష్టి సారించాలని నిర్ణయించుకున్నారని తెలిసింది. హనుమంతుడి ముందు కుప్పిగంతులన్న చందంగా తమకే పవన్ రాజకీయాలు నేర్పుతారా? అని బీజేపీ అగ్రనేతలు అంతర్గతంగా చర్చల్లో ఆగ్రహం ప్రదర్శించినట్టు తెలిసింది.
టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకునే వాతావరణం కన్పిస్తున్న నేపథ్యంలో… అసంతృప్త జనసేన, టీడీపీ నేతలపై దృష్టి పెట్టాలని బీజేపీ నేతలు ఓ నిర్ణయానికి వచ్చారని సమాచారం. పొత్తులో భాగంగా 100 నియోజకవర్గాల్లో జనసేన, టీడీపీ ఆశావహులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యే పరిస్థితులున్నట్టు బీజేపీ ఓ అంచనాకు వచ్చింది. అలాంటి వారిలో ప్రజాబలం కలిగిన నేతలను ఆదరించి, తమ పార్టీ తరపున పోటీ చేయించాలని బీజేపీ వ్యూహాత్మకంగా అడుగులు వేయనుంది.
ఇందుకోసం ప్రత్యేకంగా టీంను ఏర్పాటు చేసి టీడీపీ, జనసేన పొత్తు పంథాపై కన్నేసి, అసంతృప్తులను తమ వైపు తిప్పుకోవడం ద్వారా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ కుట్రలకు తగిన బుద్ధి చెప్పాలని బీజేపీ నేతలు కసరత్తు చేస్తున్నారని సమాచారం. పవన్ ఒకటి తలస్తే, బీజేపీ మాత్రం అందుకు భిన్నంగా ఒంటరిగా బరిలో నిలిచి బలోపేతం కావడంపైన్నే పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.