పాపం అవంతి.. ఎందుకు టార్గెట్… ?

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎక్కువగా రాజకీయ విమర్శలు చేయరు. ఆ మాటకు వస్తే ఆయన మీడియా ముందుకు వచ్చేదే తక్కువ. కానీ ఆయన మీద జనసేనాని పవన్ కళ్యాణ్…

విశాఖ జిల్లాకు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఎక్కువగా రాజకీయ విమర్శలు చేయరు. ఆ మాటకు వస్తే ఆయన మీడియా ముందుకు వచ్చేదే తక్కువ. కానీ ఆయన మీద జనసేనాని పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభలో సెటైర్లు వేశారు. బంతి చామంతి అవంతి, గోడకు కొట్టిన బంతి అవంతి అంటూ ప్రాసలతో ఆడుకున్నారు.

ఒకసారి కాదు రెండు మూడు సార్లు సభలో ఆయన ఇలాగే మాట్లాడారు. ఇంతకీ అవంతి పవన్ కి ఎందుకు టార్గెట్ అయ్యారు అన్నదే చర్చగా ఉంది. అవంతి టీడీపీ తరఫున అనకాపల్లి ఎంపీగా ఉన్నపుడు కూడా పవన్ ఇలాగే కామెంట్స్ చేశారు. ఇపుడు ఆయన వైసీపీ మంత్రిగా ఉన్నా తన మాటల తూటాలతో చెడుగుడు ఆడుతున్నారు.

నిజానికి రీసెంట్ గా అవంతి మీడియా సమావేశం పెట్టినపుడు కూడా పవన్ గురించి విలేకరులు అడిగినపుడు పెద్దగా రియాక్ట్ కాలేదు. ఆయన గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది అని మాత్రం అన్నారు. ఇక దానితో పాటు మరో మాట మంత్రి వాడారు. పవన్ కి ఏపీ మీద అంత శ్రద్ధ ఉంటే ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కాకుండా కేంద్రాన్ని ఒప్పించవచ్చు కదా అని లాజిక్ పాయింట్ అయితే తీశారు.

బహుశా ఇదే పవన్ ఫైర్ అవడానికి కారణం అంటున్నారు. ఇక అవంతి ప్రజారాజ్యం నుంచి ఫస్ట్ టైమ్ ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత ఎంపీ చేశారు. పదేళ్ళు తిరగకుండానే మంత్రి కూడా అయ్యారు. బహుశా అవంతి పొలిటికల్ కెరీర్ ఇలా సక్సెస్ ఫుల్ గా సాగడంతో అక్కసు పాటు తన అన్న పార్టీ నుంచి గెలిచి తన మీద అపుడపుడైనా విమర్శలు చేస్తున్నారు అన్న కారణాతోనే పవన్ ఆయన్ని టార్గెట్ చేశారా అన్న చర్చ ఉంది.

అయితే ప్రజారాజ్యం మాజీ బ్యాచ్ లో ఎక్కువ మంది ఇపుడు వైసీపీలో ఉన్నారు. మరికొంత మంది టీడీపీలో ఉన్నారు. వీరిలో ఎవరూ కూడా జనసేనలో చేరలేదు. దాంతోనే వారిని కావాలని పవన్ ప్రతీసారీ టార్గెట్ చేస్తున్నారని, అందులో భాగమే వెల్లంపల్లిని వెల్లులిపాయతోనూ, అవంతిని బంతి చామంతి తోనూ పోల్చారని అంటున్నారు.

ఏది ఏమైనా విద్యా సంస్థల స్థాపకుడిగా తన సేవను చేస్తూ మరో వైపు రాజకీయంగా కూడా అవినీతికి ఆస్కారం లేని విధంగా  పాలన చేస్తున్న మంత్రి అవంతి మీద జనసేనాని కామెంట్స్ చేయడం పట్ల ఆయన అనుచరులు అయితే మధన పడుతున్నారు. మరి చూడాలి దీని మీద అవంతి రిటార్టి ఇస్తారా లేదా అన్నది.