భద్రతను గాలికొదిలేశారు, విస్తరిస్తామంటున్నారు!

బేస్ మెంట్ వేయకుండా, 10 అంతస్తుల అపార్ట్ మెంట్ కడతామంటే ఎలా? రైల్వేల పనితీరు కూడా అలానే ఉంది. భద్రతా ప్రమాణాల్ని పట్టించుకోకుండా, రైల్వేస్ కు హైటెక్ హంగులు అద్దుతామంటున్నారు.  Advertisement రైల్వేల పరంగా…

బేస్ మెంట్ వేయకుండా, 10 అంతస్తుల అపార్ట్ మెంట్ కడతామంటే ఎలా? రైల్వేల పనితీరు కూడా అలానే ఉంది. భద్రతా ప్రమాణాల్ని పట్టించుకోకుండా, రైల్వేస్ కు హైటెక్ హంగులు అద్దుతామంటున్నారు. 

రైల్వేల పరంగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. ప్రతి రోజూ కోటి 30 లక్షల మంది ప్రయాణిస్తున్న ప్రజారవాణ వ్యవస్థ ఇది. గతేడాది వంద కోట్ల టన్నుల సరుకును రవాణా చేసి రికార్డ్ సృష్టించిన సంస్థ ఇది. సౌకర్యాలు, సామర్థ్యం మెరుగు పరిచేందుకు ఈసారి ఏకంగా 2.4 లక్షల కోట్ల రూపాయల్ని బడ్జెట్ లో కేటాయించింది ప్రభుత్వం. గతేడాదితో పోలిస్తే ఇది 50శాతం ఎక్కువ. భారతీయ రైల్వే గురించి ఇలా చెప్పుకుంటూపోతే చాలానే ఉంది. మరి ఈ మొత్తం వ్యవస్థలో భద్రతా ప్రమాణాల వాటా ఎంత? సామాన్య ప్రయాణికుడి ప్రాణం గాల్లో దీపమేనా?

ఒరిస్సాలోని బాలాసోర్ లో జరిగిన రైలు ప్రమాదం, ఇండియాలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో మూడోది. మృతుల సంఖ్య పెరిగేకొద్దీ, ఈ ప్రమాదం స్థానం మారుతుంది. బహుశా.. దేశంలో జరిగిన ఘోర రైలు ప్రమాదాల్లో ఇది రెండో స్థానానికి చేరే అవకాశం ఉంది.

ఓవైపు ఎంతో టెక్నాలజీ వచ్చిందంటున్నారు, మరోవైపు లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. మరి ఎందుకింత ఘోరం జరిగింది? దీనికి రైల్వే నిపుణులు చెబుతున్న సమాధానం ఒక్కటే. సౌకర్యాలు మెరుగుపరిచేందుకు, కొత్త ట్రెయిన్లు ప్రవేశపెట్టేందుకు, పోటీ పడి వేగాన్ని పెంచేందుకు ఉత్సాహం చూపిస్తున్న రైల్వే శాఖ.. భద్రత ప్రమాణాలకు మాత్రం ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎందుకంటే, రాజకీయ నాయకుల దృష్టిలో అది పైకి కనిపించదు, చెప్పుకోడానికి పనికిరాదు.

రైల్వేలో భద్రతా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు 2017-18 ఆర్థిక సంవత్సరంలోనే లక్ష కోట్ల రూపాయలతో ప్రణాళిక ప్రకటించారు. 2022-23లో ఆ బడ్జెట్ ను మరో 45వేల కోట్ల రూపాయలకు పెంచారు. కానీ ఏంటి ఉపయోగం? అత్యంత కీలకమైన ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో భద్రతా ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయి? మరీ ముఖ్యంగా అత్యంత రద్దీ లైన్ హౌరా-చెన్నై మధ్య కవచ్ వ్యవస్థ ఎక్కడెక్కడుంది?

సూపర్ ఫాస్ట్ ట్రెయిన్లను ప్రవేశపెడుతున్న ప్రభుత్వం, ట్రాక్స్ సామర్థ్యాన్ని పెంచే ఆలోచన మాత్రం చేయడం లేదు. ఏటా నిధులు కేటాయింపు జరుగుతోంది. అది పేపర్ లో మాత్రమే కనిపిస్తుంది తప్ప, అమలుకు నోచుకోలేదు. తాజాగా యాక్సిడెంట్ జరిగిన రైల్వే లైన్ కూడా అత్యంత పురాతనమైనది. బ్రిటిష్ కాలంలో వేసిన ఆ లైన్ ను ఇప్పటివరకు 2 సార్లు మాత్రమే అప్ గ్రేడ్ చేశారు. అయితే అదే టైమ్ లో సిగ్నలింగ్ వ్యవస్థను పూర్తిస్థాయిలో అప్ గ్రేడ్ చేయలేదంటున్నారు శ్రీనంద్ ఝా లాంటి రైల్వే ట్రాన్స్ పోర్ట్ నిపుణులు.

యాంటీ-కొలిసన్ పరికరాల్ని ఏర్పాటుచేయడంలో, నెట్ వర్క్ లో ఎమర్జెన్సీ వార్నింగ్ వ్యవస్థల్ని ఏర్పాటు చేయడంలో రైల్వే శాఖ చాలా నెమ్మదిగా ఉందంటున్నారు నిపుణులు. గట్టిగా ప్రశ్నిస్తే, దేశంలో రైల్వై ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతున్నాయని, లెక్కల్ని శాతాల్లో చెబుతారు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో, రైల్వై ప్రమాదాల్ని శాతాల్లో చెబితే ఎంత తక్కువగా కనిపిస్తాయో అందరికీ తెలిసిందే. ఆ అలసత్వమే తాజా ప్రమాదానికి ప్రధాన కారణం అంటున్నారు.

దేశంలోనే అత్యంత పురాతనమైన రైల్వే ట్రాక్ ఇది. అంతేకాదు, దేశంలోనే బిజీగా ఉండే రైల్వే లైన్లలో రెండో స్థానంలో ఉన్న ట్రాక్ కూడా ఇదే. ఇండియన్ రైల్వేస్ ప్రమాదాలు, ట్రెయిన్లు ఎందుకు పట్టాలు తప్పుకున్నాయనే అంశంపై సుదీర్ఘంగా అధ్యయనం చేసిన ప్రకాష్ కుమార్ సేన్ చెబుతున్న విషయం ఇది. మరి ఇలాంటి ట్రాక్ పై కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నిస్తున్నారు సేన్. దీనికితోడు రైల్వేస్ లో సిబ్బంది కొరత కూడా ప్రధాన సమస్య అని ఆయన తన అధ్యయనంలో మూడేళ్ల కిందటే చెప్పారు. సేఫ్టీ ఫస్ట్ అని పదేపదే చెప్పే రైల్వే శాఖ, తన నినాదాన్ని తానే గాలికొదిలేసి, ఇతర అంశాలపై ఎక్కువ దృష్టి పెడుతోందన్నారు.

ఏదేమైనా తాజా ఘోర ప్రమాదం, రైల్వే చరిత్రలోనే ఓ మచ్చ. లక్షా 40వేల కోట్ల రూపాయలతో సౌకర్యాలు మెరుగుపరుస్తామని, కొత్త ట్రెయిన్స్ ప్రవేశపెడతామని చెబుతున్న రైల్వే శాఖ.. వాటిని కొన్నాళ్లు పక్కనపెట్టి, అత్యవసరంగా భద్రతా ప్రమాణాలపై దృష్టి సారించాల్సిన అవసరం, అగత్యం ఏర్పడింది ఇప్పుడు.