విద్యాలయాల్లోకి ముస్లిం యువతులు హిజాబ్ ధరించి హాజరు కావడం గురించి కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మంగళవారం తీర్పును వెల్లడించబోతోంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో ప్రభుత్వం హై అలర్ట్ ను ప్రకటించింది. ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో.. సెన్సిటివ్ ఏరియాస్ లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లను చేసుకున్నారు.
కర్ణాటకలో విశ్వవిద్యాలయాల్లోకి హిజాబ్ ధరించి హాజరు కావడాన్ని ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఈ అంశంపై రాజకీయంగా కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. దీనిపై కొందరు ముస్లిం యువతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
హిజాబ్ తమ ఇచ్ఛాపూర్వకంగా ధరిస్తున్నట్టుగా, దాన్ని తమ స్వతంత్రంగా వారు పేర్కొంటున్నారు. దీనిపై సింగిల్ జడ్జి విచారించగా, తీర్పును వెల్లడించకుండానే ఈ కేసులను ధర్మాసనానికి రిఫర్ చేశారు. ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెల్లడించనుంది.
కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్తి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించనుంది. ఈ అంశంపై ఇప్పటికే కొందరు సుప్రీం తలుపు తట్టారు. అయితే కర్ణాటక హైకోర్టు ఏం చెబుతుందో ముందు వినాలంటూ సుప్రీం సూచించింది.
రాజకీయంగా కూడా ఆసక్తిని సంతరించుకున్న ఈ తీర్పు ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తిని రేపుతూ ఉంది. గత నెల ఇరవై ఐదో తేదీన ఈ అంశంపై సుదీర్ఘ వాదోపవాదాలు ముగిశాయి. ఈ నేపథ్యంలో మంగళవారం తీర్పు వెల్లడి కాబోతోంది.