కాంగ్రెస్ పార్టీకి పంజాబ్ కూడా చేజారింది. దీంతో ఆ పార్టీ కథ అయిపోయిందనే విశ్లేషణ మరోసారి హైలెట్ అవుతోంది. సోనియాగాంధీ, రాహుల్ ల నిస్తేజమైన రాజకీయం, గత దశాబ్దంన్నరగా కూర్చున్న కొమ్మలను నరుక్కోవడం ఫలితంగా కాంగ్రెస్ పార్టీ అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది. ఈ నేపథ్యంలో కూడా సోనియా, రాహుల్ లు కాంగ్రెస్ ను దాని మానన కూడా దాన్ని వదలడం లేదు. వారి నాయకత్వంపైనే ఉన్న తీవ్ర వ్యతిరేకత కాంగ్రెస్ కు ఉన్న కొద్దోగొప్పో అవకాశాలను కూడా దెబ్బతీస్తోంది.
ఆ సంగతలా ఉంటే.. ఇప్పటికీ దేశంలో ఎమ్మెల్యేల సీట్ల బలం వారీగా చూస్తే.. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగానే ఉన్నట్టుగా అనిపిస్తుంది ఆ పార్టీ నేత శశిథరూర్ వెల్లడించిన నంబర్లను గమనిస్తే. ఇది సర్వే కాదు, అధ్యయనమూ కాదు. జస్ట్ దేశ వ్యాప్తంగా అసెంబ్లీల వారీగా బలాబలాలను గమనిస్తే.. ఫుల్ ఊపు మీద ఉన్న బీజేపీలో సగానికన్నా కాస్త ఎక్కువ సీట్లనే కలిగి ఉంది కాంగ్రెస్ పార్టీ.
దేశవ్యాప్తంగా… అసెంబ్లీ సభ్యుల నంబర్లను పరిశీలిస్తే… భారతీయ జనతా పార్టీకి ఉన్న బలం 1443. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 753. బీజేపీ చేతిలో అత్యంత కీలకమైన యూపీ ఉంది. మరోసారి భారీ సంఖ్యలో సీట్ల ద్వారా అక్కడ కమలం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. యూపీతో సహా బోలెడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది.
కమలం పార్టీకి దేశంలో ఎదురేలేదు, కాంగ్రెస్ పార్టీకి ఊపే లేదు అనే పరిస్థితి స్పష్టం అవుతూనే ఉంది. అయినా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఏకంగా 753 అసెంబ్లీ సభ్యులు ఉండటం విశేషమే! లోక్ సభలో కాంగ్రెస్ బలం చాలా స్వల్పంగా ఉంది. అయితే రాష్ట్రాల అసెంబ్లీల వారీగా చూసుకుంటే.. ఇది మెరుగైన నంబరే!
236 మంది ఎమ్మెల్యేలతో టీఎంసీ మూడో స్థానంలో, 156 మంది సభ్యులతో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగో పెద్ద పార్టీగా ఉంది. 151 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత డీఎంకే, బీజేడీ వంటి పార్టీలున్నాయి.
మరి ఇంత బలం ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ మరీ అసలు లేనే లేదు అనిపించుకుంటూ ఉండటానికి కారణం నిస్సందేహంగా సోనియా, రాహుల్ ల నాయకత్వమే. బహుశా వారు కాంగ్రెస్ పార్టీని ఇకనైనా దాని మానాన దాన్ని వదిలితే.. కచ్చితంగా చాలా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. తమకు అసెంబ్లీల వారీగా మెరుగైన బలం ఉందని చెప్పడానికి ఈ నంబర్లను షేర్ చేసిన శశిథరూర్, ఇంత ఉన్నా అసలు లేనట్టుగా ఉన్న తమ పార్టీ పరిస్థితి గురించి తమ వారితోనే మరింత కూలంకషంగా చర్చించుకుంటే మంచిదేమో!