ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో జనసేనాని పవన్‌కల్యాణ్ ప్రసంగం బీజేపీకి షాక్ ఇచ్చింది. ఒకవైపు తనను రోడ్‌మ్యాప్ ఇవ్వాలని అడుగుతూనే, మరోవైపు టీడీపీతో పొత్తుకు పరోక్షంగా గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం బీజేపీకి దిక్కుతోచని పరిస్థితి కల్పించింది. ఆవిర్భావ సభపై పవన్‌కల్యాణ్ వ్యూహాత్మకంగా నడుచుకున్నారు. మనసులో చంద్రబాబుపై ప్రేమను బహిరంగంగా ప్రదర్శించారు.
“ఈ 14న జరగనున్న ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని ఆవిర్భావ దినోత్సవాల్లా చూడడం లేదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను, రాష్ట్ర భవిష్యత్‌ను దిశానిర్దేశం చేయబోతున్నాం. భావి తరాలకు ఎలాంటి భరోసా కల్పిస్తే బలమైన భవిష్యత్ ఇవ్వగలం? తదితర అంశాలపై మాట్లాడ్తా” అని పవన్‌కల్యాణ్ ఆదివారం పేర్కొన్నట్టే… తన పార్టీ శ్రేణులకే కాదు, మిగిలిన పార్టీలకు కూడా స్పష్టత ఇచ్చారు.
2024లో వైసీపీ మరోసారి ఒంటరిగా దిగనుంది. ప్రతిపక్ష పార్టీలు మాత్రం పొత్తుతో అధికార పార్టీని ఢీకొట్టనున్నాయనే సందేశాన్ని పవన్ ప్రసంగం స్పష్టం చేసింది. పవన్ ముందే ప్రకటించినట్టు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ రాజకీయాలను, రాష్ట్ర భవిష్యత్‌కు ఇవాళ పవన్ చేసిన దిశానిర్దేశం ఏంటో ఆయన మాటల్లో…
“భారతీయ జనతాపార్టీ నాయకులు, పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు. నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలో చెప్పండి. మేము చేస్తాం. అలాగే ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఎలా కలిశాయో … ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాను. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు ” అంటూ పవన్ తన వైఖరిని స్పష్టం చేశారు.
పవన్ భవిష్యత్ ఆలోచనలు ఇలా ఉంటే, మిత్రపక్షమైన బీజేపీ నేతల వైఖరి అందుకు భిన్నంగా ఉంది. 2024లో జనసేనతో కలిసి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసింది. బీజేపీని రోడ్ మ్యాప్ అడుగుతూనే, ఆ పార్టీ వద్దే వద్దంటున్న టీడీపీతో కలిసి ప్రయాణం సాగించడానికి పవన్ సానుకూలత వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పవన్ మాటలు బీజేపీని ఇరకాటంలో పడేశాయి. ఒకవేళ బీజేపీ కాదంటే, టీడీపీతోనే పొత్తు కుదుర్చుకోడానికి పవన్ సిద్ధంగా ఉన్నారని, వైసీపీపై ఆయన అక్కసు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. పవన్ ప్రసంగంపై బీజేపీ స్పందన ఎలా ఉండనుందో!