టెస్టు క్రికెట్ విషయంలో టీమిండియా బలోపేతంగా ఉందని ప్రత్యేకంగా వర్ణించనక్కర్లేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో ఆ దేశంలో టెస్టు సీరిస్ లో ఓటమి పాలవ్వడాన్ని పక్కన పెడితే, అంతకు ముందు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా దేశాలతో ఫాస్ట్ అండ్ బౌన్సీ పిచ్ లపై టెస్టుల్లో సాధించిన విజయాలు అద్భుతమైనవి. ఆస్ట్రేలియాలో వరసగా రెండు టెస్టు సీరిస్ ల విజయం ప్రస్తుత టెస్టు క్రికెట్ ఆడుతున్న ఇతర జట్లకు సాధ్యమయ్యే ఫీట్ కాదని కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అలాంటి అద్భుతాలను ఆవిష్కరిస్తున్న టీమిండియా క్రికెట్ జట్టు స్వదేశంలో అయితే అజేయంగా నిలవడంలో మరింత గొప్ప స్థాయిలో నిలుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా స్వదేశంలో వరసగా పదిహేనవ టెస్టు సీరిస్ ను నెగ్గింది. ఇంత వరకూ టెస్టు క్రికెట్ చరిత్రలో స్వదేశంలో ఇలా వరస విజయాలను సాధించిన జట్టు మరొకటి లేదు!
అత్యధికంగా ఆస్ట్రేలియా తన స్వదేశంలో పది టెస్టు సీరిస్ లను నెగ్గింది వరసగా. శ్రీలంకతో టెస్టు సీరిస్ విజయంతో టీమిండియా వరసగా పదిహేనవ సీరిస్ నెగ్గింది. ఇది వరకూ 14 సీరిస్ ల విజయంతో రికార్డును కలిగి ఉన్న టీమిండియా, ఇప్పుడు తన రికార్డును తనే సవరించింది.
ఇదే సమయంలో గత పదేళ్లుగా టీమిండియా స్వదేశంలో ఏ టెస్టు సీరిస్ నూ కోల్పోకుండా కూడా అజేయంగా నిలిచింది. చివరి సారి ధోనీ కెప్టెన్సీలో 2012లో ఇండియా స్వదేశంలో టెస్టు సీరిస్ ను కోల్పోయింది.ఆ తర్వాత ఎప్పుడూ సీరిస్ ను కోల్పోలేదు సొంత గడ్డపై. ఇలా దశాబ్దం పాటు తన విజయాల పరంపరను కొనసాగిస్తూ ఉంది.
ఈ పదేళ్లలో ఇండియా టెస్టు సీరిస్ లనే కాదు, స్వదేశంలో టెస్టుల్లో ఓడిన సందర్భాలను కూడా వేళ్ల మీద లెక్క బెట్టొచ్చు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ లతో మాత్రమే గత కొన్నేళ్లలో ఒక్కో టెస్టు మ్యాచ్ చొప్పున ఓడిపోయింది టీమిండియా క్రికెట్ జట్టు. సీరిస్ గెలుపుల్లో మాత్రం పదేళ్లుగా ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదు. పదేళ్లుగానే కాదు.. గత ఇరవై యేళ్లలో కూడా ఇండియాలో టెస్టు సీరిస్ గెలవడం పర్యాటక జట్లకు అరుదైన ఘట్టమే. 2004-05 సీజన్లో ఆస్ట్రేలియా ఇండియాపై టెస్టు సీరిస్ ను 2-1 తేడాతో నెగ్గింది.