2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీతో పొత్తుపై జనసేనాని పవన్ కల్యాణ్ పరోక్షంగా తేల్చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ చీల్చే ప్రసక్తే లేదని ప్రకటించడం ద్వారా టీడీపీతో పొత్తు వుంటుందని పవన్ చెప్పకనే చెప్పారు. జనసేన అంతిమ లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోయడమే అని స్పష్టం చేశారు. ఇవాళ్టి ఆవిర్భావ సభకు ఎంతో ప్రత్యేకత ఉందని పవన్ ముందే చెప్పిన సంగతి తెలిసిందే.
తాజా సభతో ఏపీలో రాజకీయ సమీకరణలు తప్పక మారుతాయి. అయితే ఒకవైపు బీజేపీని రోడ్ మ్యాప్ ఇవ్వాలని అడగడం, మరోవైపు వైసీపీ వ్యతిరేక ఓట్లను చీల్చే ప్రసక్తే లేదని పవన్ ప్రకటించిన నేపథ్యంలో మరోసారి 2014 నాటి రాజకీయ పొత్తులు అవతరించనున్నాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే టీడీపీతో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు పదేపదే చెబుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటంలో నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ ప్రసంగం చర్చనీయాంశమైంది. ప్రసంగం చివర్లో రానున్న ఎన్నికల్లో పొత్తులపై నర్మగర్భ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకూ ఆయన ఏమన్నారంటే….
“అధికార మదంతో ఒళ్లు బలిసి కొట్టుకుంటున్న వైసీపీ అనే మహిషానికి కొమ్ములు విరగ్గొట్టి కింద కూచోపెట్టి వచ్చే ఎన్నికల్లో సరికొత్త ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం. ఇదే జనసేన 9వ ఆవిర్భావ సభ లక్ష్యం. అలాగే భారతీయ జనతాపార్టీ నాయకులు, పెద్దలు నాకు రోడ్ మ్యాప్ ఇస్తామని చెప్పారు. నేను ఎదురు చూస్తున్నాను. మీరు ఎప్పుడు రోడ్ మ్యాప్ ఇస్తారో చెప్పండి. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని ఎలా గద్దె దించాలో చెప్పండి. మేము చేస్తాం.
అలాగే ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక శక్తులన్నీ ఎలా కలిశాయో …ఆంధ్రప్రదేశ్ బాగు కోసం సభా ముఖంగా చెబుతున్నాను. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూస్తాను. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాల విషయానికి వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తాం. నేను నలుగురికి ఇచ్చేవాన్నే, అడిగేవాన్ని కాదు. నేను పది మందికి పెట్టేవాన్ని, దోచుకునేవాన్ని కాదు. ఎవరి దగ్గరి నుంచి ఏమీ ఆశించేవాన్ని కాదు. అందరూ బాగుంటే చాలు అనుకునేవాన్ని” అంటూ పవన్ తన ప్రసంగాన్ని ముగించారు.
బీజేపీ-జనసేన కూటమి, అలాగే టీడీపీ వేర్వేరుగా పోటీ చేయడం వల్ల వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలుతాయనేది సుస్పష్టం. దీని వల్ల మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని పవన్‌కల్యాణ్ భావన. అందుకే వైసీపీని మళ్లీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు టీడీపీతో పొత్తుకు సిద్ధమని పవన్ సంకేతాలు ఇచ్చారు.
ఇటీవల చంద్రబాబునాయుడు పొత్తు ఆహ్వానాన్ని ఇచ్చిన నేపథ్యంలో, పవన్ కీలక వ్యాఖ్యలు చేయడాన్ని గమనించొచ్చు. తాను నలుగురికి ఇచ్చేవాన్నే తప్ప అడిగేవాన్ని కాదనడం ద్వారా… చంద్రబాబు అడిగారని, ఇస్తానని పవన్ చెప్పకనే చెప్పారు. మొత్తానికి 2024 ఎన్నికల్లో టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని తేలిపోయింది.