పవన్ కల్యాణ్ అంటే ఫైర్ అని అంచనా వేస్తారు అభిమానులు. సినిమాల్లో ఏమో కానీ రాజకీయాల్లో మాత్రం ఆయన ఫ్లవరేనని చాలాసార్లు రుజువైంది. తాజాగా మరోసారి అలాంటి సందర్భం వచ్చింది.
పవన్ కల్యాణ్ ఫైరా, ఫ్లవరా అని ఈరోజు తేలిపోతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆవిర్భావ సభ వేదికపై పవన్ పేల్చే పంచ్ డైలాగులు జనసైనికుల్ని ఆకర్షించినా.. ఆయన భవిష్యత్ రాజకీయంపై చేయబోయే కీలక ప్రకటన గురించే అందరూ ఎదురు చూస్తున్నారు.
పవన్ కల్యాణ్ సినిమాలకి భారీ ఓపెనింగ్స్ ఉంటాయి, అలాగే పవన్ సభలకు కూడా భారీగానే జనం వస్తుంటారు. వారందరూ తృప్తిగా ఇంటికెళ్లాలంటే, సోషల్ మీడియాలో, టీవీల్లో లైవ్ చూసేవాళ్లు సెబ్బాష్ పవన్ అనుకోవాలంటే.. ఆయన ఈ మీటింగ్ లో కీలక ఉపన్యాసం ఇవ్వాలి.
భవిష్యత్ రాజకీయాలకు దిశా నిర్దేశనం చేయాలి. పార్టీ పెట్టి ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి, ఈ దశలో ఇంకా ఏం చేయాలి, ఏం చేస్తే జనం మనల్ని ఆదరిస్తారనే విషయాన్ని కనీసం పవనైనా అర్థం చేసుకున్నారా? ఆయన అర్థం చేసుకున్నారనే విషయాన్ని జనం అర్థం చేసుకుంటారా అనేది తేలేది నేడే..
చంద్రబాబు వెయిటింగ్ ఇక్కడ..
వన్ సైడ్ లవ్ ప్రపోజల్ పవన్ ముందుంచి వెయిట్ చేస్తున్నారు చంద్రబాబు. పార్టీ ఆవిర్భావ వేదికపై దానికి ఆయన అంగీకరిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది. అందుకే కీలక ప్రకటన అంటూ అందరూ ఊరిస్తున్నారు.
చంద్రబాబుతో కలసి వెళ్లేది లేనిది చెబితే టీడీపీ నేతలకి కూడా ఓ క్లారిటీ వస్తుంది. అందుకోసమే తొందరపడి ఇటీవల 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎవరూ మాట్లాడలేదు. అంటే అక్కడే ఏదో తేడా కొట్టింది. ఆ తేడా విషయం ఏంటనేది ఈరోజు తెలిసిపోతుంది.
మరోవైపు బీజేపీ కూడా ఈ మీటింగ్ పై ఫోకస్ పెట్టింది. పవన్ ఏయే అంశాలు ప్రస్తావిస్తారనే దానిపై జనసేన రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంది. పవన్ ను ప్రేమించడం లేదని చెప్పకపోయినా పర్వాలేదు. కనీసం బీజేపీతో నైనా ఉన్నానని పవన్ కాస్త గట్టిగా చెప్పాల్సిన సమయం-సందర్భం ఇది.
జనసైనికుల సంబరాలు..
ఇప్పటికే సభ కోసం జనసైనికులు జిల్లాల నుంచి తరలి వస్తున్నారు. సంబరాలు ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. పవన్ కల్యాణ్ సభ కోసం భారీగా జన సమీకరణ జరిగింది. సందడి బాగానే ఉంది. దానికి తగ్గ సరంజామా పవన్ ప్రసంగంలో ఉందా లేదా అనేది తేలాల్సి ఉంది.
సినిమాలకి భారీ ఓపెనింగ్స్ వచ్చినట్టే సభకు కూడా భారీగా జనాలు వస్తున్నారు. మరి సినిమాల్లో పేల్చిన పంచ్ డైలాగుల్లాగే.. పొలిటికల్ లైఫ్ లో కూడా పవన్ పంచ్ డైలాగులు కొడతారా..? ఎప్పటిలాగే కీలక నిర్ణయాలేవీ లేకుండా పాతికేళ్ల ప్రస్థానం, అందులో 8 గడిచాయి, మిగతావి కూడా గడుస్తాయి అంటూ రొటీన్ డైలాగులు వేస్తారా అనేది వేచి చూడాలి.
పవన్ అంటే ఫ్లవరా.. ఫైరా.. అనేది ఇవాళ్టితో తేలిపోవాలి.