అంతేగా..అంతేగా… టీకా యుద్ధంలో కుదిరిన రాజీ

సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ మధ్య 2 రోజులుగా జరుగుతున్న టీకా యుద్ధంలో రాజీ కుదిరింది. మా టీకా గొప్పదంటే మా టీకా గొప్పదని చెప్పుకోవడమే కాకుండా.. మీ టీకాతోనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి…

సీరం ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ మధ్య 2 రోజులుగా జరుగుతున్న టీకా యుద్ధంలో రాజీ కుదిరింది. మా టీకా గొప్పదంటే మా టీకా గొప్పదని చెప్పుకోవడమే కాకుండా.. మీ టీకాతోనే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అంటూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. 

మా టీకానే ఒరిజినల్.. మిగతావన్నీ వట్టి నీళ్లేనంటూ సీరం సంస్థ నోరు జారింది. భారతీయులపై ప్రయోగాలు చేయని సీరం సంస్థకి అనుమతులెందుకిచ్చారంటూ అటు భారత్ బయోటెక్ ఆరోపించింది.

భారత్ లో అత్యవసర వినియోగానికి ఆమోదం తెచ్చుకున్న రెండు కంపెనీలు ఇలా బజారున పడటంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ కి అనుమతులిచ్చారంటూ అటు ప్రతిపక్షాలు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అటు సోషల్ మీడియాలో కూడా ట్రోలింగ్ మొదలైంది. 

ముందు కొవాక్సిన్ టీకా మోదీకి, ఆ తర్వాత అమిత్ షా కి వేయాలంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. అంతలోనే ఇరు కంపెనీలు బజారునపడటంతో ఈ వ్యవహారం రసవత్తరంగా మారింది.

చివరకు గంటల వ్యవధిలోనే రెండు కంపెనీల అధినేతలు రాజీకొచ్చారు. కొవిడ్-19 టీకా పంపిణీలో రెండు కంపెనీలు కలసి పనిచేస్తాయంటూ భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల, సీరం ఇన్ స్టిట్యూట్ సీఈఓ అదార్ పూనావాలా సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 

“గత వారం రోజులుగా రెండు కంపెనీల మధ్య ఏర్పడిన భేదాభిప్రాయాలు పక్కనపెడుతున్నాం, సమాచార లోపంతో ఎదురైన ఇబ్బందుల్ని తొలగించుకున్నాం. టీకా తయారీలో రెండు కంపెనీల శ్రమ, సాంకేతిక సత్తాను పరస్పరం గుర్తించి, గౌరవించుకుంటున్నాం, మన దేశానికి, ప్రపంచ దేశాలకు టీకా అందించాల్సిన బాధ్యతను గుర్తించి ముందుకు సాగుతాం..” అని స్టేట్ మెంట్ ఇచ్చారు.

ప్రజల చెవిలో పూలు..

ప్రజలకి టీకాలు వేయాల్సిన రెండు కంపెనీలు, ఇలా ప్రజల చెవిలో పూలు పెట్టాయి. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుని, చివరకు ఇలా సమాచార లోపం అంటూ సర్దిచెప్పుకున్నాయి. 

వాస్తవానికి సీరం సంస్థ తీసుకొస్తున్న కొవిషీల్డ్ టీకాను భారత్ లో ఎక్కువమంది వాలంటీర్లపై ప్రయోగించలేదు. లండన్ లో చేపట్టిన ప్రయోగాలను, అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రజల రోగనిరోధక శక్తిని.. ఇక్కడితో పోల్చలేం. అయినా సరే హడావిడిగా డిసీజీఐ కొవిషీల్డ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఇక మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి కాకుండానే భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాక్సిన్ కి కూడా అనుమతి వచ్చేసింది. ఇంత హడావిడిగా ఈ రెండు టీకాలకు ఆమోద ముద్ర వేయాల్సిన అవసరం కేంద్రానికి ఏమొచ్చిందనే ప్రశ్నకు బదులు లేదు.

టీకా కంపెనీల మధ్య జరుగుతున్న యుద్ధాన్ని శాంతింపజేసింది కేంద్రమే అనడంలో అనుమానం లేదు. మొత్తమ్మీద టీకా కంపెనీలు రెండూ ఒక్కటై ప్రజల చెవిలో పూలు పెట్టాయి. ఈ మొత్తం ప్రహసనం వల్ల టీకాలపై ఇప్పుడు ప్రజల్లో మరిన్ని అనుమానాలు, భయాలు మొదలయ్యాయి.

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి

ప‌వ‌న్ పిలిచి సినిమా చేయ‌మ‌న్నారు