ర‌ణ‌భేరి…మిత్రుడి కోస‌మేనా?

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎలాగైనా త‌మ వెంట న‌డిచేలా చేసుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇవాళ జ‌న‌సేన ఆవిర్బావ స‌భ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌మ భాగ‌స్వామి అని చెప్పేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా మాట్లాడింది. ఈ నెల…

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను ఎలాగైనా త‌మ వెంట న‌డిచేలా చేసుకునేందుకు బీజేపీ ప్ర‌య‌త్నిస్తోంది. ఇవాళ జ‌న‌సేన ఆవిర్బావ స‌భ జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో, ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌మ భాగ‌స్వామి అని చెప్పేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా మాట్లాడింది. ఈ నెల 19న క‌డ‌ప‌లో బీజేపీ-జ‌న‌సేన సంయుక్తంగా రణ‌భేరి నిర్వ‌హిస్తున్న‌ట్టు బీజేపీ జాతీయ నాయ‌కుడు సునీల్ దేవ్‌ధ‌ర్ తెలిపారు. అయితే సంయుక్తంగా నిర్వ‌హించే ఈ కార్య‌క్ర‌మ ఏర్పాట్ల‌లో ఎక్క‌డా జ‌న‌సేన క‌నిపించ‌డం లేదు.

ఈ ర‌ణ‌భేరి నిర్వ‌హ‌ణ‌పై రెండు రోజుల క్రితం క‌డ‌ప‌లో బీజేపీ ముఖ్య నాయ‌కులు సీఎం ర‌మేశ్‌నాయుడు, మాజీ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డి, కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్య‌క్షుడు వంగ‌ల శ‌శిభూష‌ణ్‌రెడ్డి త‌దిత‌రులు స‌మావేశం నిర్వ‌హించారు. రాయలసీమలో పెండింగ్‌ ప్రాజెక్టులు, ఇక్కడి రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప‌రిష్క‌రించ‌డంలో ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి లేద‌నే సంగ‌తిని ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో  ‘రాయలసీమ రణభేరి’ బహిరంగ సభ నిర్వహించనున్న‌ట్టు వెల్ల‌డించారు.

రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించాలనే ఆలోచన ముఖ్యమంత్రికి, మంత్రులకు ఏమాత్రం లేదన్నారు. ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా బీజేపీ సొంత వ్య‌వ‌హారం. అయితే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ ప‌క్క చూపులు చూస్తున్న నేప‌థ్యంలో, త‌మ నుంచి జారిపోకుండా ఉండేందుకు క‌లుపుకుని పోతున్న‌ట్టు బీజేపీ ఆడుతున్న డ్రామాలో భాగ‌మే సునీల్‌దేవ్‌ధ‌ర్ మాట‌లంటున్నారు. 

ర‌ణ‌భేరికి సంబంధించిన స‌మావేశంలో బీజేపీ, జ‌న‌సేన నేత‌లు క‌లిసి ఎక్క‌డా పాల్గొంటున్న దాఖ‌లాలు లేవు. బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పేరుకు పొత్తే త‌ప్ప‌, ఇంత వ‌ర‌కూ ఉమ్మ‌డిగా ఒక్క కార్య‌క్ర‌మం కూడా నిర్వ‌హించిన ఉదంతాలు లేవు. ఈ నేప‌థ్యంలో ఇవాళ్టి జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌ను దృష్టిలో పెట్టుకుని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో జ‌న‌సేన‌తో క‌లిసి ర‌ణ‌భేరి అంటూ కొత్త అంశాన్ని బీజేపీ తెర‌పైకి తెచ్చింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.