ఏంటి రాధేశ్యామ్ ఇది.. ఎందుకీ తిప్పలు?

ఓ సినిమా హిట్టవ్వడానికి ఎన్నో కారణాలుంటాయి. సక్సెస్ అయిన తర్వాత ఆ కారణాల్ని ఓపెన్ గా విశ్లేషించుకుంటే బాగుంటుంది కూడా. అలాగే ఓ సినిమా సరిగ్గా ఆడకపోవడానికి కూడా చాలా కారణాలుంటాయి. కానీ వాటిని…

ఓ సినిమా హిట్టవ్వడానికి ఎన్నో కారణాలుంటాయి. సక్సెస్ అయిన తర్వాత ఆ కారణాల్ని ఓపెన్ గా విశ్లేషించుకుంటే బాగుంటుంది కూడా. అలాగే ఓ సినిమా సరిగ్గా ఆడకపోవడానికి కూడా చాలా కారణాలుంటాయి. కానీ వాటిని ఓపెన్ గా విశ్లేషించుకోవడం అనవసరం. 

మరీ ముఖ్యంగా యూనిట్ సంయమనంతో ఉండడం ఇంకా ముఖ్యం. కానీ రాధేశ్యామ్ విషయంలో ఇలాంటి సంయమనం కొరవడుతోంది. సినిమా హిట్ అయిందా, ఫ్లాప్ అవుతుందా అనే విషయాన్ని పక్కనపెడితే.. స్వయంగా యూనిట్ లో కీలకమైన సభ్యులు కవరింగ్ చేసుకోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది.

నిన్నటికినిన్న రాధేశ్యామ్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస సోషల్ మీడియాలో స్పందించాడు. తన సినిమాటోగ్రఫీ, సినిమా కథను డామినేట్ చేసిందనే వ్యాఖ్యలపై రియాక్ట్ అయ్యాడు. రాధేశ్యామ్ సినిమాకు అంత రిచ్ నెస్, ఆ స్థాయిలో సినిమాటోగ్రఫీ అవసరం లేదనే కామెంట్స్ పై స్పందించాడు. 

ఓ సినిమాకు ఏది అవసరమో నిర్ణయించాల్సింది క్రిటిక్స్ కాదని, పైగా సినిమాను లావిష్ గా తీయాలనేది ప్రభాస్ ఆలోచన అంటూ చాలా చెప్పుకొచ్చాడు. క్లైమాక్స్ లో వచ్చే షిప్ ఎపిసోడ్ పై కూడా స్పందించిన పరమహంస, సినిమా కథకు అది సరిగ్గా సరిపోయిందనివి, విమర్శలు కట్టిపెట్టాలని గట్టిగా సూచించాడు.

అంతకంటే ముందు తమన్ కూడా ఈ సినిమాను వెనకేసుకొచ్చాడు. రాధేశ్యామ్ కు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన తమన్, సినిమా స్లోగా సాగిందనే కామెంట్స్ ను తిప్పికొట్టాడు. ఓ సినిమాను ఫాస్ట్ గా ఎలా తీయాలో నేర్పించండి అంటూ క్రిటిక్స్ కు చురకలు అంటించాడు. అక్కడితో ఆగకుండా “క్రిటిక్స్ కు ఏమైనా కాలేజ్ ఉందా బ్రో” అంటూ దెప్పిపొడిచాడు.

రాధేశ్యామ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న తమన్.. సినిమాకు వ్యతిరేకంగా మీడియా నుంచి వచ్చిన ఒక్క కామెంట్ ను కూడా స్వీకరించలేదు. దర్శకుడ్ని కూడా కాదని, తనే అన్నింటినీ తోసిపుచ్చాడు. ఈ సినిమా విషయంలో తమన్ కు ఎందుకంత అత్యుత్సాహమో అర్థంకాక మీడియా ఆశ్చర్యపోయింది. తమన్ తుత్తర చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.

మరోవైపు దర్శకుడు కూడా నెగెటివ్ కామెంట్స్ ను తిప్పికొట్టాడు. ప్రేమకథలు ఎప్పుడైనా స్లోగానే ఉంటాయన్న రాధాకృష్ణ, సినిమాలో ఫైట్ పెట్టకూడదని తామంతా ముందే నిర్ణయించుకున్నట్టు తెలిపాడు.

ఇలా యూనిట్ లో చాలామంది రాధేశ్యామ్ కు వ్యతిరేకంగా వస్తున్న కామెంట్లను తిప్పికొట్టేందుకు మాత్రమే సమయం కేటాయిస్తున్నారు. వాటిని పట్టించుకోకుండా తమ ప్రచారమేదో తాము చేసుకుంటూ పోతే మంచిది. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు సంబంధించి టూర్ కూడా ప్లాన్ చేశారు. 

రాధేశ్యామ్ సినిమాకు ఫస్ట్ వీకెండ్ ముగిసింది. ఇవాళ్టి నుంచి ఈ సినిమా రన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.