ఏపీలో మత మార్పిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆర్ఎస్ఎస్ తాజా నివేదిక ఇది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి ఊపు మీదున్న బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో కూడా పాగా వేస్తుంది అని నాయకులు చెబుతుంటే ఏంటో అనుకున్నాం కానీ.. ఇంత త్వరగా మత రాజకీయాలు మొదలవుతాయని ఎవరూ అంచనా వేయలేదు.
ఏపీ, పంజాబ్, తమిళనాడు, కర్నాటకల్లో ప్రణాళికాబద్ధంగా హిందువులను ఇతర మతాల్లోకి మారుస్తున్నారని ఆర్ఎస్ఎస్ ఆందోళన చేస్తోంది. ఆ తర్వాత ఈ స్లోగన్ బీజేపీ చేతుల్లోకి వెళ్తుంది, ఎన్నికల నాటికి బలపడుతుంది. ఇంతకీ ఏపీలో మత రాజకీయాలు ఓట్లు రాలుస్తాయా..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తల్లో కూడా ఏపీలో మత రాజకీయాలు మొదలు పెట్టాలని చూశారు బీజేపీ నేతలు. విగ్రహాల విధ్వంసం, రథాల దహనం.. ఇలా చాలా చాలా విషయాలను హైలెట్ చేసి తిరుమల నుంచి రథ యాత్ర అనే ప్రణాళిక వేశారు. చివరకు ఆ పాచిక పారకపోవడంతో సైలెంట్ అయ్యారు.
ఆ తర్వాత ఏపీలో జరిగిన ఉప ఎన్నికల్లో వరుసగా బీజేపీ పరాభవాలు ఎదుర్కోవడం, స్థానిక ఎన్నికల్లో అడ్రస్ కూడా గల్లంతవడంతో పెద్దలు సైలెంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయాలు కాస్త ఉత్సాహాన్నివ్వడంతో మళ్లీ బీజేపీ లైన్లోకి వచ్చింది. ఏపీలో పాగా వేస్తామంటూ రెచ్చిపోతోంది. పరోక్షంగా ఇలా మత రాజకీయాలు మొదలు పెట్టింది.
అహ్మదాబాద్ లో ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు జరిగిన అఖిల భారత ఆర్ఎస్ఎస్ ప్రతినిధుల సభలో ప్రత్యేకంగా ఏపీ ప్రస్తావన వచ్చింది. ఏపీలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతున్నాయని, స్థానిక ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు. కొత్త కొత్త పద్ధతుల్లో మత మార్పిడులు జరుగుతున్నాయని అన్నారు.
అంతే కాదు, ప్రభుత్వ యంత్రాంగంలోకి ప్రవేశించడానికి ఓ వర్గం విస్తృతంగా ప్రయత్నిస్తోందని, దీర్ఘకాలిక లక్ష్యంతో కుట్ర జరుగుతున్నాయని ఆర్ఎస్ఎస్ నేతలు ఆరోపించారు. అయితే ఇలాంటి ఆరోపణలతో ఏపీ ప్రజల మధ్య చిచ్చుపెట్టాలనుకోవడం, రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం అసాధ్యం.
మత రాజకీయాలకు ఏపీ తలవంచితే.. ఈపాటికి ఎప్పుడో బీజేపీ ఇక్కడ బలపడేది. కానీ ఏపీలో ప్రస్తుతం కులాల కుంపట్లు రగులుతున్నాయి. ఇక్కడ చలికాచుకోడానికే లెక్కకు మిక్కిలి పార్టీలున్నాయి. ఈ దశలో మత ప్రాతిపదికన ఓట్లు చీల్చాలనుకోవడం బీజేపీ భ్రమ. ఈ విషయంలో నార్త్-సౌత్ మధ్య తేడాను బీజేపీ గమనిస్తే మంచిది.
అయినప్పటికీ.. తమకి కలిసొచ్చిన, తమకి అధికారమిచ్చిన ఫార్ములాని ఆ పార్టీ వదిలిపెట్టదని అర్థమవుతోంది. మరి 2024 నాటికి ఏం జరుగుతుందో చూడాలి.