మరోసారి రేవంత్ రెడ్డి జోస్యం నిజమౌతుందా?

అధికార పక్షంపై విమర్శలు చేయడమే కాదు, అప్పుడప్పుడు జోస్యం కూడా చెబుతుంటారు రేవంత్ రెడ్డి. గతంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి కూడా. అందుకే రేవంత్ చెప్పే రాజకీయ జోస్యంపై చాలామంది ఆసక్తి…

అధికార పక్షంపై విమర్శలు చేయడమే కాదు, అప్పుడప్పుడు జోస్యం కూడా చెబుతుంటారు రేవంత్ రెడ్డి. గతంలో ఆయన చెప్పిన కొన్ని విషయాలు నిజమయ్యాయి కూడా. అందుకే రేవంత్ చెప్పే రాజకీయ జోస్యంపై చాలామంది ఆసక్తి కనబరుస్తారు. ఈసారి కూడా రేవంత్ రెడ్డి మరో కొత్త మేటర్ మోసుకొచ్చారు.

తెలంగాణలో డిసెంబర్ నాటికి అసెంబ్లిని రద్దు చేసి, వచ్చే ఏడాది మార్చి నాటికి ఎన్నికలకు వెళ్తారట. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవడానికేం లేదు. 

ఎందుకంటే, ఆ టైమ్ కు ఎలాగూ అసెంబ్లీ రద్దవుతుంది. అయితే ఇక్కడ రేవంత్ చెప్పే మేటర్ ఏంటంటే.. అది డిసెంబర్ లేదా అంతకంటే ముందే కావొచ్చనేది ఆయన జోస్యం. అంటే, ఈ ఏడాదిలోనే సరైన టైమ్ చూసి అసెంబ్లీని రద్దుచేసి, ముందస్తుకు వెళ్తారనేది రేవంత్ రెడ్డి మాట.

రేవంత్ జోస్యం వెనక లాజిక్ ఇది

గతంలో రైతుబంధు ప్రకటించారు కేసీఆర్. ఆ వెంటనే మినిమం గ్యాప్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అది బాగా పనిచేసింది. ఇప్పుడు ఉద్యోగాల ప్రకటన ఇచ్చారు. రేపోమాపో 2-3 నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఆ ప్రక్రియ మధ్యలో ఉంటుండగానే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు రేవంత్. 

ప్రస్తుతం ప్రకటించిన 80వేలకు పైగా ఉద్యోగాల్ని భర్తీ చేయడంతో పాటు.. మళ్లీ అధికారంలోకి వస్తే మరో లక్షన్నర ఉద్యోగాలు కల్పిస్తామనే ప్రచారంతో కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని అంటున్నారు రేవంత్.

రేవంత్ జోస్యానికి బలం చేకూర్చేలా తెలంగాణ ప్రభుత్వం నుంచి లీకులు కూడా వస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి సత్తా చాటడంతో.. కేంద్ర రాజకీయాలపై ఫోకస్ తగ్గించి, ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నారట. 

రోజులు గడిచేకొద్దీ రాష్ట్రంలో బీజేపీ మరింత బలపడే సూచనలున్నాయని, ఈలోగానే ముందస్తుకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచన చేస్తున్నట్టు పార్టీ వర్గాల నుంచే లీకులొస్తున్నాయి. 

సో.. ఇలా చూసుకున్నా రేవంత్ రెడ్డి చెప్పిన జోస్యమే నిజమౌతుంది. కాకపోతే ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీపీసీసీ చీఫ్ గా రేవంత్ చేసేదేం ఉండకపోవచ్చు. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది.