పవన్ ప్రసంగం లీక్!

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆవేశంగా ఈ రోజు ప్రసంగించబోతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేయబోతున్నారు. అయితే ఈ ప్రసంగం కంటెంట్ ఏమిటో? అది ఎలా వుండబోతోందో ముందే…

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఆవేశంగా ఈ రోజు ప్రసంగించబోతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన సుదీర్ఘ ప్రసంగం చేయబోతున్నారు. అయితే ఈ ప్రసంగం కంటెంట్ ఏమిటో? అది ఎలా వుండబోతోందో ముందే టీజర్ ఇచ్చేసారు. ఎంతయినా సినిమా మనిషి కదా? సినిమా ఇలా వుంటుందని టీజర్ ఇచ్చినట్లే తన సభ, తన ప్రసంగం ఎలా వుండబోతోందో ముందే చెప్పేసారు.

ఒక్క సీటు కూడా గెలుచుకోలేని ఓ రాజకీయ పార్టీ నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ భవిష్యత్ కోసం ఈ సభ ద్వారా దిశా నిర్దేశం చేస్తానంటూ ప్రకటించేసారు. అంటే ఈయనకు, ఈయన పార్టీకి ఓట్లేయని ప్రజలు ఇప్పుడు ఈయన చేసే దిశానిర్దేశం చేస్తారన్నమాట. ఏమని? అర్జెంట్ గా జగన్ ను, ఆయన పార్టీని ఆంధ్ర నుంచి తరిమేయమని. అంతకన్నా ఏమీ ఊహాతీతం కాదు. 

విశాఖ నాయకుడు గంటా శ్రీనివాసరావు అంటే పవన్ కు మంట. ఆయన తడవకు ఓ పార్టీ మారుతుంటారు. కానీ పవన్ చేస్తున్నది ఏమిటి? తడవకు ఓ పార్టీతో పొత్తు. అంతే కదా. భాజపాతో పొత్తు…ఆ వంకతో తేదేపాకు తగ్గరయ్యారు. ఆ తరువాత పాచిపోయిన లడ్లు ఇచ్చారు అంటూ భాజపాను వదిలేసారు. అంతలోనే లోకేష్ మీద గట్టిగా ఆరోపణలు చేసి తెలుగుదేశం పార్టీని వదిలేసారు.

ఎన్నికలు అయిన తరువాత మళ్లీ భాజపాకు దగ్గరయ్యారు. ఇప్పుడిప్పుడే తేదేపా కూడా తనకు దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తోంది. కచ్చితంగా 2023 ఎన్నికల్లో తేదేపా-జనసేన కలిసే పోటీ చేస్తాయని యాంటీ జగన్ వర్గాలు అన్నీ కోడై కూస్తున్నాయి. కాదని పవన్ కూడా చెప్పలేరు. చెప్పకపోవచ్చు కూడా. ఆ మధ్య జరిగిన పంచాయతీ ఎన్నికల్లో లోపాయకారీ పొత్తుతొనే కదా పోటీ చేసింది. అది గ్రౌండ్ లెవెల్లో అందరికీ తెలిసిన వాస్తవం.

సరే ఇంతకీ పవన్ ఈరోజు తన ప్రసంగంలో ఏం చెప్పబోతున్నారు. రెండున్నరేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందనే కదా? పవన్ ఏం చెప్పబోతున్నారనేది తెలుసుకోవడం కన్నా గత రెండున్నరేళ్లుగా యాంటీ జగన్ మీడియా ఏం రాస్తోందో, రాసిందో గుర్తుచేసుకుంటే చాలు. అవే పాయింట్లు వుంటాయి. అంతకన్నా కొత్తవి ఏమీ వుండదు. కానీ వాటికి పవన్ హావభావాలు తోడవుతాయి అంతే.

అంతే తప్ప తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తామని కానీ, భాజపా-తేదేపా-జనసేన ట్రయాంగిల్ లవ్ స్టోరీ డెవలప్ చేస్తా అని కానీ చెప్పరు. తాను సినిమాలు చేసుకుంటూంటే అడ్డుకుంటున్నారని కావాలంటే ఓ ఫినిషింగ్ టచ్ లాంటి పాయింట్ యాడ్ చేస్తారు. 

జనసేన ఆవిర్భావం నుంచి అమరావతి రైతుల దగ్గర చేసిన ప్రసంగాల మీదుగా ఇప్పటి వరకు పవన్ స్టయిల్, ఆ కప్పదాటు మాటలు జనాలకు అలవాటైపోయాయి. దీనికి మళ్లీ ఓ టీజర్ ఇవ్వనక్కరలేదు.