చావుడప్పు మోగుతోంటే సర్కారు కదలదెందుకు?

జంగారెడ్డి గూడెంలో వరుస చావులు అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో 18 మంది మగవాళ్లు.. ఒకే రకం లక్షణాలతో చనిపోయారు. ఇవన్నీ నాటుసారా కారణంగా సంభవించిన మరణాలే అని స్థానికులు,…

జంగారెడ్డి గూడెంలో వరుస చావులు అందరిలోనూ ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో 18 మంది మగవాళ్లు.. ఒకే రకం లక్షణాలతో చనిపోయారు. ఇవన్నీ నాటుసారా కారణంగా సంభవించిన మరణాలే అని స్థానికులు, మీడియా కోడై కూస్తున్నాయి. అయితే ఈ విషయం ఒప్పుకోవడానికి ప్రభుత్వం ససేమిరా అంటోంది. పైగా బాధ్యతగల రాష్ట్రమంత్రులు ఈ మరణాల గురించి మాట్లాడుతున్న మాటలు.. ప్రభుత్వం మీద అనుమానాలు రేకెత్తించేలా ఉన్నాయి. 

ఒకే రకం లక్షణాలతో ఒకే ప్రాంతంలో వరుసమరణాలు సంభవిస్తే ఏ రకంగా చూసినా.. కంగారు పుట్టడం సహజం. అజ్ఞానం బాగా ముదిరితే తొలి అనుమానాలు మంత్రతంత్రాలు, శాంతుల మీదికి వెళతాయి గానీ.. వరుస మరణాలు అనగానే కాలుష్యం, స్థానికంగా ఉండే పారిశ్రామిక ఉద్గారాలు, ఆ ప్రాంతపు తాగునీటి వనరుల మీదికి, మరణినంచిన వ్యక్తులకు ఉండగల దీర్ఘకాలిక రోగాల మీదికి అందరికీ అనుమానాలు వెళతాయి. 

ఇలాంటి సాధారణ అనుమానాలనే బాధ్యతగల మంత్రులు షేర్ చేసుకుంటున్నారు. కేవలం మూడు రోజలు వ్యవధిలో 18 మంది ఒకే ఊర్లో మరణించడం అంటే మాటలు కాదు. అయితే.. కొవిడ్ తదనంతర ఇబ్బందుల వలన, అనారోగ్యం వలన మృతిచెందారంటూ మంత్రులు పేర్ని నాని, నారాయణస్వామి చెప్పడం భావ్యంగా లేదు. 

ఊరు ఊరంతా ఇవి నాటు సారా మరణాలు అని అంటోంది. మీడియా మొత్తం కోడై కూస్తోంది. అయితే ఇవి నాటు సారా మరణాలు అనే మాట ఒప్పుకోవడానికి వారి అంతరంగం ఒప్పుకోవడం లేదు. నాటుసారా మరణాలు అంటే.. వెంటనే అది ప్రభుత్వ వైఫల్యం కిందికి వస్తుంది గనుక, మాయ చేసి బుకాయించడానికి ప్రయత్నిస్తున్నారు. 

విచారణ ఏమీ జరగక ముందే, కారణాలను ఎవ్వరూ నిగ్గు తేల్చకముందే మంత్రులు తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చేసి తమ విశ్లేషణల్ని బయటపెట్టేస్తుండడమే అన్ని అనుమానాలకు కారణం.

ఇవి నాటు సారా మరణాలే అని చాలా రుజువులు చెబుతున్నాయి. మరణించిన వారి కుటుంబాలన్నీ అదే మొత్తుకుంటున్నాయి. మరణించడానికి ముందు అందరూ కూడా నాటుసారా తాగిన వారే. కానీ.. ప్రభుత్వానికి మాత్రం అలా అనిపించడం లేదు. ఈ కారణాన్ని ఒప్పుకుంటే.. నాటుసారా తయారీకేంద్రాలను అరికట్టడంలో తమ వైఫల్యం బయటపడిపోతుందని ప్రభుత్వం భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. 

లిక్కర్ ధరలను విచ్చలవిడిగా పెంచిన నాటినుంచి.. రాష్ట్రంలో నాటు సారీ తయారీ కూడా ఒక కుటీర పరిశ్రమ రేంజిలో వర్ధిల్లుతోంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల నుంచి లిక్కర్ స్మగ్లింగ్ లు పెరిగాయి. ఎక్సయిజు శాఖ తో సంబంధంలేకుండా.. ప్రభుత్వం స్పెషల్ ఎన్ఫోర్స్‌మెంట్ బ్యూరో ను ఏర్పాటు చేసింది. వీరికి చాలా విస్తృతాధికారాలు ఇచ్చారు. సెబ్ దూకుడు పెరిగింది. 

లిక్కర్ స్మగ్లింగ్ల ఆట కట్టించడం సెబ్ బాధ్యత అయింది. నాటుసారా తయారీ అరికట్టడం కూడా వీరి బాధ్యతే. కానీ.. ఆ విషయంలో ఆ సెబ్ దారుణంగా ఫెయిలైందనడానికి ఒక నిదర్శనం జంగారెడ్డి గూడెం 18 చావులు. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో నాటుసారా తయారీ ఒక్క జంగారెడ్డిగూడెంలో మాత్రమే ఉన్నదా? మరెక్కడా లేదా? అనే సందేహం మనకు కలుగుతుంది.

కేవలం ప్రభుత్వ వైఫల్యం ఒప్పుకోడానికి ఇష్టం లేకనే.. జంగారెడ్డి గూడెం చావులను మంత్రులు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారా? లేదా, అక్కడ నాటుసారా తయారీ దార్లతో ఈ మంత్రులు కుమ్మక్కయి మాట్లాడుతున్నారా అనే సందేహం కూడా కలుగుతుంది. ప్రభుత్వానికి మద్యనిషేధం మీద, ఆ విషయంలో వారు అశక్తులైతే, కనీసం ప్రాణాలను బలిగొనే ఈ నాటుసారా అరికట్టడం మీద చిత్తశుద్ధి ఉన్నదో లేదో ఎలా ఎప్పటికి నిరూపించుకుంటారు?