అరవింద్ రెండో కుంపటి మండుతుందా?

సంప్రదాయ పార్టీలతో కాకుండా సొంత పార్టీతో సొంతంగా ఎదిగి, ఢిల్లీ గద్దెని ఆదర్శవంతంగా పాలించి, క్రమంగా పంజాబ్ ని కూడా కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞుడు అరవింద్ కేజ్రీవల్.  Advertisement భాజపా ప్రాభవం తగ్గని నేపథ్యంలో,…

సంప్రదాయ పార్టీలతో కాకుండా సొంత పార్టీతో సొంతంగా ఎదిగి, ఢిల్లీ గద్దెని ఆదర్శవంతంగా పాలించి, క్రమంగా పంజాబ్ ని కూడా కైవసం చేసుకున్న రాజనీతిజ్ఞుడు అరవింద్ కేజ్రీవల్. 

భాజపా ప్రాభవం తగ్గని నేపథ్యంలో, ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల కమలం వికసిస్తే పంజాబులో మాత్రం అరవిందం వికసించింది. 

అర్ధం విషయంలో కమలమన్నా, అరవిందమన్నా ఒకటే అయినా…వాడిపోయిన “కమలం” పువ్వులను సైతం పక్కకి ఊడ్చేసే శక్తి “చీపురుకట్ట”కుంది. అది కొద్దికొద్దిగా నిరూపితమౌతోంది.  

54 ఏళ్ల అరవింద్ కెజ్రీవాల్ కి రాజకీయంగా ఈ విజయం చాలా పెద్దది. నాయకుడనేవాడు తాను ఎదుగుతూ కొత్త నాయకుల్ని తయారు చేస్తుంటాడు. కెజ్రీవాల్ అదే చేసాడు. 

48 ఏళ్ల భగవంత్ మన్ అనే నాయకుడిని తన ఆం ఆద్మీ పార్టీ ద్వారా పంజాబ్ ఓటర్స్ ముందు నిలబెట్టి అతనికి ఘనమైన విజయాన్ని అందించాడు. 

పంజాబ్ ప్రజలు ఎంత భగవంత్ కే ఓట్లేసినా అదంతా వెనుకున్న కెజ్రీవాల్ కటౌట్ చూసే. పంజాబ్ ఓటర్లు కెజ్రీవాల్ ఢిల్లీ పాలనకు ఎటువంటి గౌరవాన్నిస్తున్నారో చూపించారు. 

అలా కెజ్రీవాల్ పంజాబులో ఆం ఆద్మీ పార్టీ రెండవ కుంపటికి నిప్పంటించాడు. 

అయితే ఇప్పుడు పంజాబ్ రాష్ట్రం నడవాల్సింది భగవంత్ మన్ నాయకత్వంలో. కెజ్రీవల్ స్థాయిలో అతను రాష్ట్రాన్ని నడపగలిగి సక్సెస్ చేయగలిగితే ఇక ఆం ఆద్మీ పార్టీకి దేశంలో తిరుగుండదు. 

ఒక్క గుజరాతులో అద్భుతమైన ప్రగతి సాధించాడన్న పేరుతో నరేంద్రమోదీని అందలమెక్కించి ప్రధానిని చేసిన దేశమిది. 

అలాంటిది ఒకచోట కాకుండా ఢిల్లీ మరియు పంజాబ్ రాష్ట్రాల్లో జనాన్ని మెప్పించగలిగితే అరవింద్ కెజ్రీవాల్ కి కూడా చక్రవర్తియోగాన్ని కల్పిస్తారు దేశప్రజలు. 

దేశంలో అన్ని చోట్లా తమ పాగా వెయ్యాలని భాజపా విశ్వప్రయత్నాలూ చేస్తోంది. చాలా చోట్ల ప్రాంతీయ పార్టీల ఎదురుగాలి తగులుతూనే ఉంది. 

దేశ స్థాయిలో చాలానాళ్లు సమ ఉజ్జీగా నిలబడ్డ కాంగ్రెస్ నేడు మట్టికరిచేసినా ఆం ఆద్మీ పేరుతో మరొక పార్టీ జాతీయస్థాయిలో శక్తిని పుంజుకుంటోంది. 

కాలక్రమంలో భాజపాకి ప్రత్యామ్నాయంగా ఆం ఆద్మీ పార్టీ ఆవిర్భవించే అవకాశాలెక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ అవకాశాల్ని పాడుచేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కెజ్రీవాల్ మీద, ఇప్పుడు కొత్తగా గెలిచిన పంజాబ్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్ మన్ మీదా ఆధారపడి ఉంది. 

– శ్రీనివాసమూర్తి