దర్శకుడు త్రివిక్రమ్ మహా మేధావి. పైకి నవ్వుతూనే లోలోపలే దానికి రివర్స్ గా ఆలోచించగల దిట్ట. ఎవరిని ఎక్కడ ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో తెలిసిన మేధావి. అందరితో గురూజీ అనిపించుకుంటూనే టాలీవుడ్ లో అందరికన్నా ఎక్కువ సంపాదిస్తున్న దర్శకుడిగా మారారు. ఆఫ్ కోర్స్ రాజమౌళి ఇక్కడ మినహాయింపు అనుకోండి.
ఇప్పుడు త్రివిక్రమ్ ఒకే దెబ్బతో రెండు పిట్టలు కొట్టే పనిలో పడ్డారు. ఇప్పటికే ఓ దెబ్బ కొట్టారు. రెండు పిట్టలు పడ్డాయి. ఒక పిట్ట మైత్రీ మూవీస్ సినిమా వెనక్కు వెళ్లడం. మరో పిట్ట ఆయన చేతిలో పది కోట్ల రెమ్యూనిరేషన్ అని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఓ రీమేక్ సినిమాకు కాస్త సవరించిన స్క్రీన్ ప్లే, మాటలు అదించినందుకు పది కోట్ల రెమ్యూనిరేషన్ అంటే అది కేవలం త్రివిక్రమ్ ప్రతిభకేనా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పవన్ తో సినిమా సెట్ చేసిన రెమ్యూనిరేషన్ కూడా ఆ విధంగా కలిసి వచ్చిందేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
గమ్మత్తేమిటంటే ఇప్పుడు మరోషాట్ కొట్టారు. ఈ షాట్ కు మైత్రీ మూవీస్ సినిమా మరోసారి వెనక్కు వెళ్లిపోయింది. సముద్రఖని సినిమా ముందుకు వచ్చింది. ఇది కూడా రీమేక్ నే. ఈసారి ఓ రీమేక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నందుకు త్రివిక్రమ్ కు ముడుతున్న రెమ్యూనిరేషన్ 20 కోట్లు పైమాటే అని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తే భారీ రెమ్యూనిరేషన్ అంటే అర్థం వుంది. కేవలం రీమేక్ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు అందివ్వడానికి ఇరవై కోట్లు అంటే ఇక్కడ కూడా పవన్ తో సినిమా సెట్ చేసినందుకు కృతజ్ఞత కలిసిందేమో అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
మైత్రీ మూవీస్ కు త్రివిక్రమ్ కు చానాళ్ల క్రితం బెడిసింది. ఆయన అడ్వాన్స్ ను వడ్డీతో సహా వెనక్కు తీసుకుంది మైత్రీ మూవీస్. ఆఫ్ కోర్స్ ఈ బాకీ తీర్చింది హారిక హాసినినే. అదంతా వారి ఇంటర్నల్ వ్యవహారం. కానీ తన ముక్కు పిండి వడ్డీ వసూలు చేసారని అప్పటి నుంచి త్రివిక్రమ్ మైత్రీ మూవీస్ మీద కోపం పెంచుకున్నారన్నది టాలీవుడ్ వర్గాల గుసగుస. అందుకే ఒక్కోసినిమా పవన్ కు చకచకా సెట్ చేస్తున్నారని టాక్.
సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో పవన్ సినిమా ముగియగానే వైష్ణవ్ తేజ్ కాంబినేషన్ లో పవన్ సినిమా రెడీగా వుంది. దీనికి త్రివిక్రమ్ స్వంత కథ మాటలు అందించబోతున్నారు. దానికి వేరే దర్శకుడు పని చేస్తారు. అంటే 2022 పవన్ డైరీ మరి ఖాళీ లేనట్లే. 2023 లో చూడాలి మైత్రీ మూవీస్ సినిమా సంగతి.
అల వైకుంఠపురములో తరువాత త్రివిక్రమ్ డైరక్షన్ సినిమారాలేదు. రెండేళ్ల గ్యాప్. కానీ ఈ రెండేళ్లలో ఆయన మూడు సినిమాలకు మాటలు అందించినట్లు అవుతుంది. ఆ విధంగా ఓ నలభై యాభై కోట్ల రెమ్యూనిరేషన్ వచ్చేసింది. అదీ అదృష్టం, చాకచక్యం, మేధావితనం అంటే..థాంక్స్ టు పవన్ కళ్యాణ్.ఎందుకంటే ఆయనే కదా డేట్ లు ఇస్తున్నది. లేకపోతే ఇవన్నీ సాధ్యం కాదు కదా ?
గమ్మతేమిటంటే టాలీవుడ్ లో ఓ పాయింట్ వినిపిస్తోంది. పవన్ ఫ్యాన్స్ ఇప్పుడు త్రివిక్రమ్ ఫ్యాన్స్, హరీష్ శంకర్ ప్యాన్స్ గా విడిపోయారని. ఎంత వరకు నిజమో ఏమో?