తెలుగులో మల్టీస్టారర్లు చాలా తక్కువ. మంచి కథలు దొరికినా మరో స్టార్ హీరోతో కలిసి నటించడానికి ఇంకో స్టార్ హీరో అంగీకరించడు. ఈ ఫొటో చూస్తే మల్టీస్టారర్లు ఎందుకు తెలుగులో పెద్దగా రావో ఇట్టే అర్థమౌతుంది.
ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా ఓ స్టిల్ రిలీజ్ చేశారు. హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ జెండా పట్టుకొని నిల్చున్న ఫొటో అది. అది ఇలా రిలీజైందో లేదో, అలా ఫ్యాన్ ఎడిట్ లు మొదలైపోయాయి. మెగా ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను తీసేసి, కేవలం చరణ్ ఉన్నట్టు ఎడిట్ చేసుకుంటే.. తారక్ ఫ్యాన్స్ దానికి రివర్స్ లో ఓన్లీ తమ హీరో మాత్రమే కనిపించేలా ఎడిట్లు చేసుకున్నారు.
ఇలా రామ్ చరణ్ ను కట్ చేయడం వెనక సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ కూడా జరిగింది. ఆ జెండాను పట్టుకునే విధానంలో చరణ్ చేయి పైన ఉంది. దీనిపై కొంతమంది అభిమానులు డిస్కషన్ స్టార్ట్ చేశారు. 'మనదే పైచేయి' అనేది ఆ చర్చ సారాంశం. దీంతో కోపగించుకున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్, పోస్టర్ నుంచి ఏకంగా రామ్ చరణ్ ను డిలీట్ చేసి పడేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో తారక్ బైక్ పై, చరణ్ గుర్రంపై ఉన్న స్టిల్ ను రిలీజ్ చేస్తే.. తమకు ఎవరు కావాలో వాళ్లను మాత్రమే ఉంచి, మరో హీరోను డిలీట్ చేశారు ఫ్యాన్స్. బహుశా ఇందుకేనేమో తెలుగులో మల్టీస్టారర్లు పెద్దగా రావు.