ఇంతవరకూ ఏ ప్రభుత్వం కూడా చేయని విధంగా ఆర్యవైశ్యులకు ఎంతో మేలు చేసిన జన నేతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ జాతి గుండెల్లో నిలిచిపోయారని దివంగత ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అల్లుడు, విద్యా సంస్థల అధినేత పైడా క్రిష్ణ ప్రసాద్ మెచ్చుకున్నారు.
ఆర్య వైశ్య కార్పోరేషన్ కి తాజా బఢ్జెట్ లో ఏకంగా 915 కోట్ల నిధులను కేటాయించడం అంటే మాటలు కాదని ఆయన అన్నారు. ఒక వైపు కరోనా వంటి అతి పెద్ద విపత్తు రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సందర్భంలో ఆర్ధికంగా ఇబ్బందులు ఎన్నో ఉన్నా కూడా తమ జాతి మీద జగన్ ప్రత్యేక శ్రద్ధ చూపించి భారీగా నిధులు మంజూరు చేశారు అంటే సదా ప్రశంసనీయమని అన్నారు.
గతంలో ఏ ప్రభుత్వం కూడా ఆర్యవైశ్యులకు ఇంతటి మేలు చేయలేదని ఆయన అన్నారు. ఆర్య వైశ్యుల అభ్యున్నతికి జగన్ సర్కార్ విశేష కృషి చేస్తోందని, దానికి తమ జాతి మొత్తం కృతజ్ఞతతో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి వైసీపీ సర్కార్ కి ఈ ప్రశంస చాలా విలువ అయినదిగా భావించాలి.
వైసీపీ విషయంలో ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో విమర్శలు కొన్ని పార్టీలు చేయిస్తూ వచ్చాయి. రోశయ్య పట్ల, ఆర్య వైశ్యుల పట్ల వైసీపీ సర్కార్ సరిగ్గా వ్యవహరించలేదు అన్న విమర్శలకు జవాబు అన్నట్లుగా జగన్ అసెంబ్లీలో సంతాప తీర్మానం పెట్టి రోశయ్య ఉమ్మడి ఏపీకి చేసిన సేవలను వేన్నోళ్ళ కొనియాడారు.
అంతే కాదు బడ్జెట్ లో ఆర్యవైశ్యులకు పెద్ద పీట వేశారు. రోశయ్య కుటుంబీకుడే దాన్ని మెచ్చుకున్న వేళ విపక్షాలు ఇప్పటిదాకా చేసినవి కువిమర్శలే అని వైసీపీ నేతలు అంటున్నారు.