ఖమ్మంలో కులాల పోరే: కాంగ్రెస్ స్కెచ్!

కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కొన్ని స్థానాలు ఖరారు అయిన సంగతులు బయటకు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇద్దరు కీలక నాయకుల మధ్య సీటు కోసం ఉన్న…

కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అభ్యర్థుల జాబితాను ఇంకా ప్రకటించకపోయినప్పటికీ కొన్ని స్థానాలు ఖరారు అయిన సంగతులు బయటకు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఇద్దరు కీలక నాయకుల మధ్య సీటు కోసం ఉన్న పంచాయితీ ఒక కొలిక్కి వచ్చింది. 

కాంగ్రెస్ అధిష్టానం చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి.. జిల్లా కేంద్రం ఖమ్మం నియోజకవర్గం లో కమ్మ పోరుకు తెరతీసింది. పాలేరులో రెడ్ల మధ్య పోటీ జరుగుతుంది. ఈ నిర్ణయం ద్వారా ఉభయ ప్రయోజనాలు ఉంటాయని పార్టీ ఆశిస్తోంది.

ఖమ్మం జిల్లాలో పాలేరు సీటు అనేది చాలా హాట్ హాట్ గా మారిన సంగతి అందరికీ తెలిసిందే. కెసిఆర్ వ్యతిరేక వ్యాఖ్యలతో భారత రాష్ట్ర సమితి బహిష్కరించిన తర్వాత.. కమలదళం సుదీర్ఘ ప్రయత్నాలు చేసినప్పటికీ లొంగకుండా,  కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు సీటునే ఆశిస్తున్నారు. అదే సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బిఆర్ఎస్ నుంచి ఇటీవల కాంగ్రెస్ లోకి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే సీటు కోరుకుంటున్నారు. వీరిద్దరికీ సర్దుబాటు చేయడం రాహుల్ గాంధీ వరకు వెళ్ళింది.

అనుచర వర్గం పుష్కలంగా ఉన్న పొంగులేటి శ్రీనివాస రెడ్డికి పాలేరు సీటు కేటాయించి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండే ఖమ్మం నియోజకవర్గాన్ని తుమ్మల నాగేశ్వరరావుకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది.  రాహుల్ గాంధీ సర్ది చెప్పడంతో ఇందుకు తుమ్మల అంగీకరించారు కూడా. ఖమ్మంలో బిఆర్ఎస్ తరఫున పువ్వాడ అజయ్ కుమార్ పోటీ చేస్తున్నారు. ఆయన కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. సో, ఆయనకు దీటైన పోటీ ఇవ్వడానికి కమ్మ కులంలో ప్రాబల్యం కలిగి ఉన్న తుమ్మల నాగేశ్వరరావును ఆ సీటు నుంచే బరిలోకి దించాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

అదే సమయంలో పాలేరులో మరో సంగతిని గమనించాల్సి ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు, వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల కూడా ఇదే సీటు  నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, వైయస్ కుటుంబంతో చాలా సాన్నిహిత్యం ఉంది కూడా. ఇక్కడ టిఆర్ఎస్ అభ్యర్థిగా కందాల ఉపేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

నిజానికి తుమ్మల పాలేరు సీటును కోరుకున్న సమయంలో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మం నుంచి బరిలోకి దిగడానికి అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే అధిష్టానం జోక్యంతో ఫైనలైజ్ అయిన సమీకరణాలలో.. ఖమ్మంలో ఇద్దరు కమ్మ నాయకులు, పాలేరులో ముగ్గురు రెడ్డి నాయకుల మధ్య పోటీ జరుగుతుంది. జిల్లా అంతటికీ కలిపి మూడే జనరల్ నియోజకవర్గాలు ఉన్న ఖమ్మంలో ఈ సమీకరణాలు ఆసక్తికరం.