ఒరిస్సాలో ఘోర రైలుప్రమాదం జరిగింది. షాలిమర్-చెన్నై కోరమండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదానికి గురైంది. ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టి పట్టాలు తప్పింది. అటు వస్తున్న మరో ఎక్స్ ప్రెస్ రైలు, ట్రాక్ పై పడిన బోగీల్ని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 50 మంది మరణించినట్టు, 300 మందికి పైగా గాయపడినట్టు అనధికారిక సమాచారం.
షాలిమర్ లో మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు బయల్దేరింది కోరమండల్ ఎక్స్ ప్రెస్. పశ్చిమ బెంగాల్ వాసులకు ఇది ఎక్కువగా ఉపయోగకరంగా ఉన్నప్పటికీ, కోస్తాంధ్ర ప్రజలకు కూడా ఇది సుపరిచితం. అలా దాదాపు పూర్తి ఆక్యుపెన్సీతో బయల్దేరిన కోరమండల్ ఎక్స్ ప్రెస్, ఒరిస్సా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లా బహనాగ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు తప్పింది.
ఈ ప్రమాదంలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పి, పక్కనే ఉన్న ట్రాక్ పై పడ్డాయి. అదే టైమ్ లో అటుగా వస్తున్న యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ రైలు… ఈ బోగీల్ని ఢీకొట్టింది. దీంతో ప్రమాద తీవ్రత రెట్టింపు అయింది. అదే టైమ్ లో యశ్వంత్ పూర్-హౌరా ఎక్స్ ప్రెస్ లో కూడా 4 బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో క్షతగాత్రుల సంఖ్య భారీగా పెరిగింది.
జరిగిన ఘటనపై వెంటనే ఒరిస్సా సర్కార్ స్పందించింది. దగ్గర్లో ఉన్న హాస్పిటల్స్, మెడికల్ కాలేజీలను అప్రమత్తం చేసింది. అందుబాటులో ఉన్న 80కి పైగా అంబులెన్సుల్ని ఘటనా స్థలానికి పంపించింది. ప్రమాదానికి గల కారణాల్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.