ఈ నెల 14వ తేదీ నుంచి వారాహి యాత్ర ప్రారంభించనున్న జనసేనాని పవన్‌కల్యాణ్‌ను మాజీ మంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఉతికి ఆరేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓ రేంజ్‌లో పవన్‌ను చాకిరేవు పెట్టారు. చంద్రబాబు సూచన మేరకే పవన్ యాత్ర మొదలు పెడుతున్నారని విమర్శించారు. లోకేశ్‌కు ఇబ్బంది లేకుండా తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో యాత్ర చేయాలని బాబు సూచన మేరకే, పత్తిపాడు నుంచి స్టార్ట్ చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు.
షూటింగ్‌లు లేకనే పవన్ వారాహి యాత్ర చేపట్టారని పేర్ని నాని ఎద్దేవా చేశారు. అన్నవరం టు భీమవరం టూర్ ప్యాకేజీనా అని పేర్ని నాని ప్రశ్నించారు. దసరా, సంక్రాంతి, ఉగాది, శ్రీరామ నవమి అయిపోయాయని… ఇక అన్నవరం, భీమవరం వచ్చాయా? అని నవ్వుతూ పవన్‌ను కుళ్లపొడిచారు. పోనీలేండి, ఆయన తిప్పలేవో పడనీయండి ఎవరో ఒకరి కోసం అని పవన్‌పై సానుభూతి చూపారు. అన్నవరమో, భీమవరమో, చంద్రవరమో అని వెటకరించారు. అన్నవరం, భీమవరం బదులు చంద్రవరం యాత్ర అని పెడితే సరిపోతుందని దెప్పి పొడిచారు.
ఎప్పుడూ చూడని విధంగా యాత్ర చూపుతానని పవన్ చెబుతున్నారని, ఇలాంటివన్నీ సినిమాకు క్లాప్ కొట్టే రోజు డైరెక్టర్, ప్రొడ్యూసర్ చెబుతుంటారని వ్యంగ్యంగా అన్నారు. ఖచ్చితంగా ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుందని, తెలుగు చరిత్రలో ఇది రికార్డు సృష్టిస్తుందని, బద్దలు కొడుతుందని, ఈ సినిమా అద్భుతంగా వుంటుందని అంటారని చెప్పుకొచ్చారు. సినిమా రిలీజ్ రోజు కూడా అట్లే చెబుతారన్నారు.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆహా, ఓహో అని చెప్పినట్టే, రాజకీయాల్లో కూడా సినిమా తంతు చూపుతున్నారని పవన్‌పై సెటైర్స్ విసిరారు. తనకు సీట్లు, ఓట్లు, ముఖ్యమంత్రి పదవి వద్దని, జగన్ దిగిపోవాలి, చంద్రబాబు గద్దె ఎక్కాలని పవనే చెబుతున్నారని, ఇక వారాహి యాత్రతో జనానికి చేరువయ్యేది ఏంటని పేర్ని నాని నిలదీశారు. తనకు జనం ఓట్లు వేయరని ఆయనే చెబుతున్నప్పుడు ఇక ప్రజలకు చేరువయ్యే మాట ఉత్పన్నమయ్యేది ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. ఇది సినిమా ప్రమోషన్‌లాగా చేసుకోవడం తప్పితే, ఎందుకు పనికి రాదని పేర్ని నాని తేల్చి చెప్పారు. ఇది కేవలం చంద్రవరం యాత్ర అని స్పష్టం చేశారు.
అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్‌ను తిట్టడమే పవన్ ఎజెండా అని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నా, లేకున్నా పొగడడమే పవన్ పని అన్నారు. అలాంటి జనసేనను రాజకీయ పార్టీ అంటామా? అని ఆయన నిలదీశారు. పిఠాపురమో, తెనాలో, తిరుపతి సీటో ఏదో ఒకటి పడేయాలని కోరడమే జనసేనాని తాపత్రయమని పేర్ని నాని విమర్శించారు. దసరా నుంచి వారాహి తిరుగుతున్నదని అనుకుంటున్నామని, తిరగట్లేదా? అని వ్యంగ్యంగా మీడియా ప్రతినిధులను నాని ప్రశ్నించారు. తిరగకుండా ఎక్కడుందో అని ఆయన అడిగారు.
ఓహో…హైదరాబాద్‌లో వాహనం వుందా? తెలంగాణాలో దాచారా? అని తనదైన వెటకారంతో ఆయన ప్రశ్నించారు. వారాహి యాత్రకు ఇవ్వాల్సిన వాడు అనుమతి ఇవ్వాలి కదా అని ఒక ప్రశ్నకు సమాధానంగా నవ్వుతూ ఆయన సమాధానం చెప్పారు.