ప్రధాని మోడీ లాలూచీపడే కేటగిరీ నాయకుడా?

తాను అధికారంలో ఉండగా, అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడానికి కూడా పూనుకోకుండా రకరకాల పేర్లతో నాటకాలు ఆడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రాష్ట్ర విభజన దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. రాష్ట్రం చీలి…

తాను అధికారంలో ఉండగా, అధికారికంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడానికి కూడా పూనుకోకుండా రకరకాల పేర్లతో నాటకాలు ఆడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు రాష్ట్ర విభజన దినోత్సవాన్ని కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. రాష్ట్రం చీలి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. రెండు రాష్ట్రాల్లోనూ ఉన్న తెలుగు ప్రజలు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేమీ గుర్తు రాలేదు. 

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన అక్టోబరు ఒకటవ తేదీని ఆయన గుర్తించలేదు. ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన నవంబరు ఒకటవ తేదీన కూడా ఉత్సవాలు నిర్వహించలేదు. తెలంగాణలో కూడా  శవాసనం వేసిన పార్టీని, ఈసారి లేపి నిలబెట్టాలని అనుకుంటున్నారు గనుక జూన్ 2న ప్రత్యేకంగా మీడియా ముందుకు వచ్చారు. సందర్భం ఏదైనా మీడియా ముందుకు వస్తే చాలు జగన్మోహన్ రెడ్డిని తూలనాడడం ప్రయారిటీగా పెట్టుకునే చంద్రబాబు నాయుడు ఈసారి కూడా అనేక నిందలు వేశారు.

తన మీద ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికి, అరెస్టు కాకుండా తప్పించుకు తిరగడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి కేంద్రంతో లాలూచీపడ్డారు.. అనేది ఈసారి ప్రధాన ఆరోపణ. ఈ మాటల ద్వారా చంద్రబాబు నాయుడు ఏమి సంకేతం ఇస్తున్నారు? లాలూచీ అనేది ఒకవైపు నుంచి ఒకరు ప్రయత్నించినంత మాత్రాన జరిగే వ్యవహారం కాదు కదా. 

చంద్రబాబు ఈ ఆరోపణ చేయడం ద్వారా కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ కూడా జగన్ తో లాలూచీపడ్డారని తెలుగు ప్రజలకు చెప్పదలుచుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే గనుక ఇలాంటి లాలూచీల అలవాటు ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ దళంతో కొత్తగా పొత్తు బంధం పెట్టుకోవడానికి ఆయన ఎందుకు ఎగబడుతున్నారు? అనేవి ప్రజలకు కలుగుతున్న సందేహాలు!

చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అంశాన్ని కూడా నిస్సిగ్గుగా ప్రస్తావించారు. ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టి జగన్ లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని ఇప్పటికే బీరాలు పలుకుతున్నారు!

మరి అలాంటప్పుడు.. బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలనే నిబంధనను చంద్రబాబు పెట్టగలరా అనేది ప్రశ్న? తన పరిపాలన సాగుతున్న రోజులలో డబ్బులు దండుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీ కోసం అంగీకరించి.. ప్రత్యేక హోదా డిమాండ్ ను చేజేతులా సర్వనాశనం చేసిన నాయకుడు చంద్రబాబు! 

ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తన వైఫల్యాలు అన్నింటిని మోడీ మీదకి నెట్టేయడానికి.. ప్రత్యేక హోదా కోసం ధర్మ పోరాట దీక్షల పేరిట డ్రామాలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు హోదాను తాకట్టు పెట్టారని జగన్ మీద కొత్తగా నిందలు వేయడం చాలా చౌకబారుగా ఉంది.