భారతదేశంలో ముస్లింలకు రక్షణ లేదని రాహుల్ తన విదేశీ పర్యటనలో వ్యాఖ్యానించడం ఇప్పుడు దేశమంతా రచ్చరచ్చ అవుతోంది. రాహుల్ ఏం మాట్లాడినా సరే అందులో రంధ్రాన్వేషణ చేస్తూ ఆయనను ఎద్దేవా చేయడానికి, విమర్శించడానికి ప్రత్యేకంగా నియమితులై వుండే కమలదళం నాయకులు ఇప్పుడు ఒక్కుమ్మడిగా విరుచుకు పడిపోతున్నారు.
రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి మన దేశం పరువు తీసేస్తున్నారని పాపం బిజెపి నాయకులు కుమిలిపోతున్నారు. దేశం పరువు ప్రతిష్టలను నిలబెట్టడానికి తామెంత కష్టపడి పోతున్నామో చెప్పుకుంటున్నారు. మోడీని విమర్శించడం అంటే భారతదేశాన్ని అవమానపరచడమే అని మోడీ అంటేనే భారతదేశానికి పర్యాయపదంలాగా రంగు పులిమి తమ మితిమీరిన స్వామి భక్తిని ప్రదర్శించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భారతదేశాన్ని కించపరిచేలాగా విదేశీ గడ్డమీద మాట్లాడడం రాహుల్ కు అలవాటు అయిపోయిందని విమర్శిస్తున్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకుల కంగారు ప్రతి విమర్శలను గమనిస్తే రాహుల్ విమర్శలతో వాళ్లు భుజాలు తడుముకుంటున్నట్లుగా కనిపిస్తోంది. రాహుల్ చేసిన అసలు విమర్శలను వదిలేసి.. ఆస్ట్రేలియా ప్రధాని – మోడీని బాస్ అని అభివర్ణించడాన్ని చూసి రాహుల్ ఓర్వలేకపోతున్నారంటూ బిజెపి నాయకులు వక్రభాష్యాలు చెబుతున్నారు.
రాహుల్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో కూడా, సంబంధంలేని మోడీ పేరును లాక్కు వచ్చి ఆయన భజన చేయాలనే వారి ఉత్సాహం మనకు కనిపిస్తోంది. భారతదేశంలో ప్రజాస్వామ్యమే లేకపోతే గనుక.. రాహుల్ ఇవాళ విదేశీ గడ్డ మీదకు వెళ్లి ఇలాంటి విమర్శలు చేయగలరా అంటూ ముఖ్తార్ అబ్బాస్ నక్వి విమర్శిస్తున్నారు.
అంతా బాగానే ఉంది. ‘భారతదేశంలో ముస్లిములకు రక్షణ లేదు’ అనే కామెంట్ రాహుల్ చేసినందుకు.. విదేశీగడ్డమీద మన పరువు తీస్తున్నారని వీరు ఆక్రోశించడలో అర్థం లేదు. ఎందుకంటే.. రాహుల్ స్థాయి నాయకుడు- స్వదేశంలో ఉండి ఆ వ్యాఖ్య చేసినా కూడా ప్రపంచం అందరి దృష్టిని అది ఆకర్షిస్తుంది. ఆ ప్రతివిమర్శలో విలువలేదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, రాహుల్ వ్యాఖ్యలు తప్పు అనే మాట బిజెపి వారు అనడం లేదు. కేవలం ఆయన అలా మాట్లాడడం తప్పు అంటున్నారే తప్ప, ఆయన చెప్పిన కంటెంట్ తప్పు అనడం లేదు.
ఈ దేశంలో ముస్లిములకు తమ కేంద్ర ప్రభుత్వం గొప్పగా భద్రత కల్పిస్తున్నదని, నిశ్చింతగా బతికే వాతావరణాన్ని కల్పిస్తున్నదని చెప్పడానికి బిజెపి నాయకులకు నోరు రావడం లేదు. ఈ ఒక్క పరిణామం చాలు.. రాహుల్ వ్యాఖ్యలతో కమలదళం భుజాలు తడుముకుంటున్నదని అనడానికి అని పలువురు విమర్శిస్తున్నారు.