మళ్లీ సీరియస్ పాలిటిక్స్ లోకి నాగబాబు?

నాగబాబు మరోసారి సీరియస్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారా? ఆయన తాజా ప్రకటన చూస్తే అదే నిజమేమో అనిపిస్తోంది.  Advertisement “నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా తోటి ప్రజలకు సహాయపడాలని నిర్ణయించుకొని,…

నాగబాబు మరోసారి సీరియస్ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారా? ఆయన తాజా ప్రకటన చూస్తే అదే నిజమేమో అనిపిస్తోంది. 

“నేను పుట్టి పెరిగిన నా దేశానికి, నా తోటి ప్రజలకు సహాయపడాలని నిర్ణయించుకొని, అదే గమ్యంగా, నా లక్ష్యంగా పయనించాను. ఇప్పట్నుంచి నా పూర్తి సమయాన్ని నా గమ్యం దిశగా ప్రయాణం కొనసాగించడానికి ఉపయోగించాలని నిర్ణయించుకున్నాను.” అంటూ నాగబాబు చేసిన ప్రకటన చూస్తుంటే.. అది కచ్చితంగా పొలిటికల్ రీఎంట్రీ అనిపించకమానదు.

రాజకీయాలకు ఎప్పటికప్పుడు దూరం

నాగబాబుకు రాజకీయాలు కొత్త కాదు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పట్నుంచి ఆయన రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఆయనలో నిలకడ లేదు. ఇలా వస్తారు, అలా రాజకీయాలు చేస్తారు, మళ్లీ వెళ్లిపోతారు. అంతెందుకు, మొన్నటికిమొన్న అదే పని చేశారు. పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనలో చేరారు. తమ్ముడి అండతో ఏకంగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారు. 

ఓడిపోయిన వెంటనే ఇంటికెళ్లిపోయారు. దానికితోడు ఆమధ్య చేసిన  కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలతో పూర్తిగా పార్టీకి దూరమయ్యారు. అలా రాజకీయాల్ని పక్కనపెట్టి జబర్జస్త్ చేసుకుంటూ కొన్నాళ్లు, ఆ తర్వాత జబర్దస్త్ నుంచి బయటకొచ్చి మరికొన్ని కామెడీ కార్యక్రమాలతో ఇంకొన్నాళ్లు, మధ్యలో సినిమాలు చేస్తూ, యూట్యూబ్ ప్రసంగాలతో మరికొన్నాళ్లు టైమ్ పాస్ చేశారు. 

ఇప్పుడు మరోసారి నాగబాబుకు రాజకీయాలపై మనసుమళ్లినట్టు కనిపిస్తోంది. అందుకే గమ్యం, లక్ష్యం, ప్రజలకు సహాయం అంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నారు

ఇటు ట్రోలింగ్స్, అటు సలహాలు

నాగబాబు ప్రకటన ఇలా వచ్చిన వెంటనే అలా ట్రోలింగ్ షురూ అయింది. “అంజనా ప్రొడక్షన్స్ ఎత్తేశావ్.. ప్రజారాజ్యాన్ని ముంచేశావ్.. జబర్దస్త్ నుంచి కంటెస్టెంట్లను లాగేశావ్.. జనసేనను ఎటూ కాకుండా చేశావ్.. ఈసారి ఇంకేం చేస్తావ్” అంటూ నెటిజన్లు నాగబాబుపై కామెంట్లతో విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ ను వదిలేసెయ్ అంటూ మరికొందరు విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు నాగబాబుకు సీరియస్ సజెన్షన్లు కూడా వచ్చాయి. ఇకనైనా నిలకడగా రాజకీయాలు చేస్తే భవిష్యత్తు ఉంటుందని సూచిస్తున్నారు కొందరు. మరికొందరు నాగబాబును నియోజకవర్గాల్లోకి వెళ్లాలని సూచిస్తున్నారు. ఈ రెండేళ్లు క్షేత్రస్థాయిలో, ప్రజలకు అందుబాటులో ఉంటే ఫలితం ఉండొచ్చని సలహా ఇస్తున్నారు.

ఇంతకీ నాగబాబు మనసులో ఏముందో? మరిన్ని వివరాలతో త్వరలోనే ముందుకొస్తా అంటూ క్వశ్చన్ మార్క్ తో తన ప్రకటన ముగించారు నాగబాబు