అనసూయ అనగానే ఎవరికైనా జబర్దస్త్ గుర్తొస్తుంది. ఆ కార్యక్రమానికి ఓ కలర్ తీసుకొచ్చారు అనసూయ. తన గ్లామర్ తో పాటు, మధ్యమధ్యలో తన మార్క్ పంచ్ లతో కూడా ఎట్రాక్ట్ చేస్తారు. అయితే వెండితెరపైకి వచ్చేసరికి మాత్రం అనసూయ పూర్తిగా భిన్నం. ఆమె చేసే సినిమాలు, ఎంచుకుంటున్న పాత్రలు.. ఆమె టెలివిజన్ కెరీర్ కు పూర్తి విరుద్ధంగా ఉంటున్నాయి. ఇలాంటి టైమ్ లో అనసూయతో సినిమాలో మంచి కామెడీ చేయిస్తే ఎలా ఉంటుంది?
దర్శకుడు జయశంకర్ కు సరిగ్గా ఇలాంటి ఆలోచనే వచ్చినట్టుంది. అనుకున్నదే తడవుగా ఆయనో కామెడీ ట్రాక్ లాక్ చేశాడు. ప్రస్తుతం అనసూయ కీలక పాత్రగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు ఈ దర్శకుడు. ఇంకా పేరుపెట్టని ఈ సినిమాలో అనసూయ ఎయిర్ హోస్టెస్ గా కనిపించనుంది. ఇందులో ఆమె కామెడీ కూడా చేసినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించి తాజాగా శ్రీనివాసరెడ్డి, చమ్మక్ చంద్ర లాంటి కొంతమంది ఆర్టిస్టులతో ఓ హిలేరియస్ కామెడీ ఎపిసోడ్ పిక్చరైజ్ చేశారు. ఇందులో అనసూయ కూడా పాల్గొందంట. అలా కెరీర్ లో తొలిసారిగా ఆమె వెండితెరపై కామెడీ ట్రై చేసినట్టున్నారు.
క్షణం, రంగస్థలం, పుష్ప లాంటి సినిమాల్లో సీరియస్ పాత్రలు పోషించారు అనసూయ. ఎఫ్2, సోగ్గాడే చిన్నినాయనా లాంటి సినిమాల్లో కనిపించినప్పటికీ ఆమెను గ్లామర్ వరకు మాత్రమే వాడుకున్నారు. అయితే ఈ కొత్త సినిమాలో మాత్రం అనసూయ నుంచి జబర్దస్త్ పంచ్ లు ఆశించొచ్చని చెబుతోంది యూనిట్.
అనూర్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను చికాగోకు చెందిన వ్యాపారవేత్తలు ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయింది. అనసూయతో పాటు హెబ్బా పటేల్, సాయికుమార్, అతుల్ కులకర్ణి ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించబోతున్నారు.