రాధేశ్యామ్ షూటింగ్ టైమ్ లో ఓ సూసైడ్ లెటర్ బయటకొచ్చింది. సినిమా అప్ డేట్స్ రెగ్యులర్ గా ఇవ్వడం లేదని, తను ఆత్మహత్య చేసుకుంటే అందుకు యూవీ క్రియేషన్స్ బాధ్యత వహించాల్సి ఉంటుందంటూ ఓ లేఖ తెగ వైరల్ అయింది. ఈసారి నిజంగానే సూసైడ్ జరిగింది.
రాధేశ్యామ్ సినిమా బాగాలేదనే టాక్ తో మనస్తాపం చెంది, ప్రభాస్ అభిమాని ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలులోని తిలక్ నగర్ లో జరిగింది ఈ దుర్ఘటన.
24 ఏళ్ల రవితేజ వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఇతడు హార్డ్ కోర్ ప్రభాస్ అభిమాని. తల్లి కూలిపనులు చేస్తుంది, తండ్రి లేడు. తన అభిమాన హీరో సినిమా రిలీజ్ అవ్వడంతో, తన స్నేహితులతో కలిసి రాధేశ్యామ్ సినిమాకు వెళ్లాడు రవితేజ. అయితే సినిమా బాగాలేదంటూ కామెంట్స్ చేశారు స్నేహితులు.
స్నేహితులు హేళన చేయడంతో రవితేజ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇంటికొచ్చి అదే విషయం తల్లికి కూడా చెప్పాడు. నిన్న ఎవ్వరూ లేని సమయం చూసుకొని ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు.
ఊరికి వెళ్లిన తల్లి అతడికి ఫోన్ చేస్తే ఎత్తలేదు. స్నేహితులు వచ్చి ఇంటి తలుపుకొడితే తీయలేదు. దీంతో అనుమానించిన స్నేహితులు, వెల్డింగ్ మెషీన్ తో తలుపు పగలగొట్టి చూడగా, ఉరి వేసుకొని కనిపించాడు రవితేజ.
కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా బాగాలేదన్న బాధతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుడి తల్లి పోలీసులకు తెలిపింది.