దేశ రాజధాని ఢిల్లీ నగరం.. నడిరోడ్డుపై ఓ యువతిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13 సార్లు కత్తితో ఆమెను పొడిచాడు. దీంతో ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. సంచలనంగా మారిన ఈ ఘటనలో ఊపిరి పీల్చుకునే విషయం ఏంటంటే.. ఆ యువతి ప్రాణాలతో బతికి బయటపడింది.
ఢిల్లీకి చెందిన గౌరవ్ పాల్, బాధిత యువతి కొన్నాళ్లుగా చనువుగా ఉంటున్నారు. ఈ క్రమంలో పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు 27 ఏళ్ల గౌరవ్ పాల్. నేరుగా తన బంధువులతో కలిసి యువతి ఇంటికెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడాడు. అయితే వేరే కులం కావడంతో పిల్లను ఇవ్వమని వాళ్లు చెప్పేశారు.
ఆ తర్వాత కొన్ని రోజులకే యువతి కూడా గౌరవ్ పాల్ ను దూరం పెట్టంది. కొన్ని రోజుల పాటు ఫోన్ లో మాట్లాడిన ఆమె, ఆ తర్వాత అతడి నంబర్ ను కూడా బ్లాక్ చేసింది. దీంతో గౌరవ్ తట్టుకోలేకపోయాడు. సమయం కోసం వేచి చూశాడు.
లాడో సరాయ్ ప్రాంతంలో బాధిత మహిళ, ఆఫీస్ కు వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుంది. క్యాబ్ ఎక్కే టైమ్ కి గౌరవ్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. క్యాబ్ లోనే ఆమెపై హత్యయత్నం చేశాడు. వెంట తెచ్చుకున్న కత్తితో 13సార్లు దాడిచేశాడు. వెంటనే అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్, స్థానికుల సహాయంతో గౌరవ్ ను పట్టుకొని పోలీసులకు అప్పగించాడు.
ఆ వెంటనే యువతిని హాస్పిటల్ లో జాయిన్ చేశాడు. తీవ్ర గాయాలతో హాస్పిటల్ లో చేరిన యువతి, ఇక బతకదని అంతా అనుకున్నారు. కానీ ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ప్రస్తుతం కోలుకుంటున్నట్టు వైద్యులు ప్రకటించారు. సున్నితమైన భాగాలపై కత్తిపోట్లు లేకపోవడం ఆమె అదృష్టం అన్నారు.