చంద్రబాబు పాలనలో తన మాట శిలాశాసనంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు దుస్థితి పగవారికి కూడా వద్దనించేలా ఉంది.
ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఒకప్పుడు అధికార పార్టీ ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించిన ఏబీకి.. ఇప్పుడు భయం అంటే ఏంటో జగన్ సర్కార్ అనుభవంలోకి తెచ్చింది. 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి ఫిరాయించడం వెనుక ఏబీ కీలకంగా వ్యవహరించారని వైసీపీ ఆగ్రహంగా ఉంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అధికార మార్పిడి ఏబీ వెంకటేశ్వరరావుకు కష్టాలు తెచ్చింది. నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో ఇప్పటికే ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. అయితే కోర్టులకు సంక్రాంతి సెలవులను దృష్టిలో పెట్టుకుని, బెయిల్‌కు వెళ్లే పరిస్థితి లేనిది చూసుకుని ప్రభుత్వం తనను అరెస్ట్ చేస్తుందని ఆయన భయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. సెలవులొస్తే ఎవరైనా ఆనందిస్తారు. కానీ ఏబీలో మాత్రం సెలవులు బీపీ పెంచుతుండడం గమనార్హం. తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు.
తనను అరెస్ట్ చేయకుండా రాష్ట్ర డీజీపీతో పాటు ఏసీబీ డీజీ, సీఐడీ అదనపు డీజీలను ఆదేశించాలని పిటిషన్లో ఆయన కోరారు. గతంలో ఇదే రీతిలో అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు రిట్ పిటిషన్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది. గతంలో ఏబీ పిటిషన్‌కు అసలు విచారణార్హత లేదంటూ హైకోర్టు కొట్టివేసింది.
ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అఖిల భారత సర్వీస్ రూల్స్ కింద క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు ఏబీకి నోటీ సులు జారీ చేసింది. దీంతో ఆయనకు అరెస్ట్ భయం పట్టుకుంది.
తనను 48 గంటల పాటు కస్టడీలో ఉంచి… ఆ కారణంతో మరోసారి సస్పెండ్ చేయాలని ప్రయత్నిస్తున్నారని పిటిషన్లో ఏబీ పేర్కొన్నారు. బాబు పాలనలో అధికారాన్ని, రాజకీయ అండ చూసుకుని రెచ్చిపోయిన ఏబీకి ఇప్పుడు తత్వం బోధపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందర్నీ భయపెట్టిన ఏబీలో భయం చూస్తే… నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని పరిస్థితి.