ఆ మధ్య కోట్ల రూపాయల ఖరీదు అయిన ఒక కారును కొని వార్తల్లో నిలిచిన యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఇప్పుడు ఒక భారీ ధర విలువ చేసే ఇంటిని కొని వార్తల్లో నిలుస్తోంది. 23 యేళ్ల వయసున్న జాన్వీ కపూర్ తాజాగా కొనుగోలు చేసిన ఒక ఇంటి విలువ ఏకంగా 39 కోట్ల రూపాయలు అని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన స్టాంప్ డ్యూటీ కిందే 78 లక్షల రూపాయల చెల్లింపులు జరిగినట్టుగా తెలుస్తోంది. గత ఏడాదే ఈ ఇంటి కొనుగోలుకు సంబంధించిన ప్రతిపాదనలు రెడీ కాగా, ప్రస్తుతం రిజిస్ట్రేషన్ జరిగినట్టుగా తెలుస్తోంది.
ముంబైలోని జుహూ ప్రాంతంలో ఈ మల్టీ ఫ్లోర్స్ బిల్డింగ్ ను కొనుగోలు చేసిందట జాన్వీ. అయితే బాలీవుడ్ లో స్టార్లకు ఈ తరహాలో ఇళ్లను కొనుగోలు చేయడం పెద్ద కథేం కాదు. తొలి సినిమాకు ముందే స్టార్ డమ్ ను కలిగి ఉన్న జాన్వీ కపూర్..ఆ సినిమా విడుదల తర్వాత మరిన్ని అవకాశాలు పొందింది.
తన గ్లామర్ తో బోలెడన్ని అవకాశాలను సొంతం చేసుకుంటూ ఉంది. ఇక ఎండోర్స్ మెంట్ ఒప్పందాలకూ లోటు లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు భారీ సంపాదన సాధ్యం అవుతూ ఉంది.
ఆ సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. ఇలా ముంబైలో భారీ ధరతో ఇంటిని కలిగి ఉన్న బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరిగా నిలుస్తోంది జాన్వీ.